విజయవాడ, మే 19,
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను టిడిపి మహానాడుగా నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాది మాదిరి.. ఈ ఏడాది కూడా టిడిపి మహానాడు నిర్వహణకు సిద్ధమవుతోంది. ఈసారి శతజయంతి వేడుకల సందర్భంగా నూతన భావజాలాన్ని చాటేలా.. ఒంగోలు సమీపంలోని మండువారిపాలెం గ్రామ పరిధిలో మహానాడు నిర్వహించాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. ఈ మేరకు నిర్వహణ కమిటీలతో చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. తొలుత ఒంగోలు మినీ స్టేడియం వద్ద మహానాడు నిర్వహించాలనుకున్నా.. అందుకు ప్రభుత్వం నిరాకరించడంతో వేదికను మార్చినట్లు చంద్రబాబు తెలిపారు. మొదట పరిశీలించిన మండువారి పాలెంలోనే మహానాడు నిర్వహిస్తామని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు మండువారిపాలెం రెవెన్యూ విలేజ్ పరిధిలో గల త్రోవగుంట ప్రాంతంలో మే 27,28 తేదీల్లో టిడిపి మహానాడు జరగనున్నట్లు చంద్రబాబు తెలిపారు. మహానాడు నిర్వహణ సమయానికి వర్షాలు వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో ఒంగోలు మినీ స్టేడియం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేయగా.. చివరి నిమిషంలో నిరాకరించడం పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో..తొలుత పరిశీలించిన బృందావన్ ఫంక్షన్ హాల్ ప్రాంతంలోనే మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. నూతనత్వంతో, భావజాలం చాటేలా మహానాడు నిర్వహించాలని చంద్రబాబు నేతలకు సూచించారు. స్టేడియం కోసం దరఖాస్తు చేసి, అవసరమైన ఫీజు చెల్లించినా ప్రభుత్వం ఒంగోలు మినీ స్టేడియం ఇవ్వకపోవడంపై టిడిపి నేతలు మండిపడ్డారు. మే 17 నుంచి సభా ప్రాంగణంలో మహానాడు పనులు మొదలయ్యాయి.