అనంతగిరి
అల్లూరిసీతారామరాజు జిల్లాలో జలపాతాలు పర్యా టకులకు ఒకవైపు ఆహ్లాదాన్ని, ఆనందాన్నిస్తుంటే అక్కడికి వెళ్ళినవారు మరణించడంతో విషాదం నెలకొంటోంది. సరియా జలపాతం టూరిస్టుల పాలిట మృత్యుకుహరంగా మారింది. అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ పరిధిలోని సరియా జలపాతం ప్రమాదభరితంగా మారింది.సరియా జలపాతానికి విహారానికి వచ్చిన విశాఖకు చెందిన ఇద్దరు యువ కులు గల్లంతయ్యారు.వారి మృతదేహాలను అనంతగిరి పోలీసులు ఎట్టకేలకు గుర్తించి ఒడ్డుకు చేర్చారు. విశాఖ జగదాంబ సమీపంలోని ఎల్లమ్మతోట ప్రాంతానికి చెందిన నలుగురు స్నేహితులు సరియా జలపాతం సందర్శించేందుకు వచ్చారు. వారిలోదుక్కసాయి 39 ప్రమాదవశాత్తూ జలపాతంలో జారిపడగా తనను రక్షించే ప్రయత్నంలో చైతన్య అనే 17 ఏళ్ళ యువకుడు కూడా అందరి కళ్లముందే గల్లంతయ్యాడు. దీంతో ఆందోళనకు గురైన మిగిలిన ఇద్దరు స్నేహితులు సమీపంలోని దేవరాపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయగా అనంతగిరి పోలీసులు గజ ఈతగాళ్లుతో మృతదేహాలను గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సరియా జలపాతంపై పోలీసులు స్థానికులు పలు హెచ్చరికలు సూచనలు చేస్తున్నప్పటికీ తరచూ పర్యాటకులు జలపాతంలో మృత్యువాతకు గురవుతున్నారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసినప్పటికీ పర్యాటకులు వాటిని పట్టించు కోకపోవడంతో ప్రమాదాలకు గురై వారి కుటుంబాలను శోకసంద్రంలో ముంచుతున్నారు.ఇప్పటికైనా అధికారు లు భద్రతా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.