సత్యసాయి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీలోనూ ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకపక్క ప్రతిపక్ష పార్టీతో నిత్యం యుద్ధం చేస్తూనే, మరోపక్క అధికార పక్షం నేతలు కూడా భిన్నాభిప్రాయాలతో గొడవలకు దిగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా సత్యసాయి జిల్లాలో అభివృద్ధి సలహా మండలి సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేల మధ్య రచ్చ కొనసాగింది.
సత్యసాయి జిల్లా అభివృద్ధి సలహా మండలి సమావేశంలో తమ తమ నియోజకవర్గాలకు నీటి కేటాయింపుల విషయంలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరి వాదన వారు వినిపించారు. నీటి కేటాయింపుల విషయంలో ఎవరికి వారు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. గత ఏడాది ఏ విధంగా నీటి కేటాయింపులు జరిగాయో , ఈ ఏడాది కూడా అదే విధంగా నీటి కేటాయింపులు జరగాలని, పెనుగొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్ నారాయణ డిమాండ్ చేశారు. ఇక రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తన నియోజకవర్గానికి ఆయకట్టు ప్రాతిపదికన నీటి కేటాయింపులు జరపాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
వీరిద్దరి వాదన ఈ విధంగా ఉండగా మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి అన్ని నియోజకవర్గాలకు సమాన ప్రాతిపదికన నీటిని ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ ఇద్దరు ఎమ్మెల్యేలు చేస్తున్న వాదనకు భిన్నంగా కొత్త వాదన వినిపించారు. నీటి కేటాయింపుల విషయంలో తమ నియోజకవర్గానికి అన్యాయం చేస్తే ఊరుకోనని చెప్పారు. ఇలా ఎవరికి వారు యమునా తీరే అన్నట్టు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్యసాయి జిల్లా ఎమ్మెల్యేలు నీటి కేటాయింపుల విషయంలో ఎవరికి వారు గట్టిగానే తమ వాదన వినిపించారు.