విజయవాడ, మే20,
అంధ్రప్రదేశ్ లో పాలన అద్భుతంగా ఉందని వైసీపీ నేతలు అంటున్నారు.. 80 శాతానికిపై గా ప్రజలు తమ పాలనకు బ్రహ్మరథం పడుతున్నారంటూ సీఎం జగన్ సైతం అభిప్రాయంలో ఉన్నరని వైసీపీ వర్గాలు అంటున్నాయి. అయితే విపక్షాల మాత్రం.. గతంలో ఎన్నడూ లేనంతాగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందంటున్నాయి. గాలిలో వచ్చిన పార్టీ గాలిలోనే కొట్టుకుపోతుందని విమర్శలు చేస్తున్నారు విపక్ష నేతలు. ముఖ్యంగా రోడ్లు, ఇతర మౌలిక వసతులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం ఇదే వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రోడ్లు దారుణంగా ఉన్నాయి అన్నారు. వెంటనే వైసీపీ మంత్రులు, నేతలు కేటీఆర్ పై విరుచుకుపడ్డారు.. బస్సులు వేసుకొని రండి.. ఏపీలో రోడ్లు ఎంత బాగున్నాయో చూపిస్తామంటూ సవాల్ విసిరారు. అయితే జగన్ ప్రభుత్వంతో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో..ఆ వ్యాఖ్యలపై వెనక్కు తగ్గినట్టు స్వయంగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అయినా ఆ దుమారం కొనసాగుతోంది. తాజాగా ఏపీలోని రోడ్ల పరిస్థితిపై చిన జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నేరుగా విమర్శలు చేయకుండా.. ఏపీలో రోడ్ల దుస్థితిపై సెటైర్లు వేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామి పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీలో రోడ్ల పరిస్థితి పై చిన్న జీయర్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి ప్రయాణించేందుకు సుమారు 3 గంటలకుపైా సమయం పట్టిందన్నారు. ఒక్కో ప్రయాణంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. ప్రయాణంలో ఇటువంటి ఇబ్బంది ఏర్పడడానికి బహుశా… రోడ్ల మీద గోతులు ఎక్కువ ఉండ వచ్చంటూ చిన్న జీయర్ స్వామి సైటర్లు వేశారు. ఏపిఐఐసి మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం ఆహ్వానంతో రాజమండ్రిలో చిన్న జీయర్ స్వామి ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారు. ఈ సందర్భంగా ఏపి లో రోడ్ల దుస్థితి పై చిన్న జీయర్ స్వామి చేసిన హాట్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నారు. తాజగా స్వామి చేసిన వ్యాఖ్యలతో ప్రతిపక్షాలకు ఆయుధం దొరికినట్టేనా.. ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా పరిస్థితులు ఉన్నాయని చాలాకాలంగా ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీని టార్గెట్ చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ గుంతల మయం అయిన రోడ్లపై వినూత్నమైన నిరసన తెలియజేసి, రోడ్లను తక్షణం మరమ్మతు చేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అయినా నేటికీ ఏపీలో రోడ్లు దారుణంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది.ఏపీలో రోడ్ల దుస్థితిపై తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు చేయడానికి వెళ్ళిన చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. చిన్నజీయర్ స్వామి కూడా ఏపీ ప్రభుత్వ అసమర్థతని తెలియజేశారు అన్న చర్చ సాగుతుంది. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, అనేక రకాల పన్నులతో, టోల్ వసూళ్ల తో ప్రజలను బాదుతున్న జగన్ సర్కార్ రాష్ట్రంలో రహదారుల మరమ్మతు పనులు చేపట్టడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక జనసేన కూడా రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించింది. పెద్ద ఎత్తున పోరాటాలకు తెరతీసింది. ఇక తాజాగా గడపగడపకు ప్రభుత్వం పేరుతో వెళుతున్న వైసిపి ప్రజాప్రతినిధులకు రోడ్ల సమస్యపై కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.