ఏలూరు, మే 20,
ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి బలంగా ఉన్న జిల్లా పశ్చిమ గోదావరి. 2014లో క్లీన్ స్వీప్ చేసిన తర్వాత మరింతగా బలం పుంజుకుంటుందని భావించినా 2019 ఎన్నికల్లో మాత్రం పార్టీ జిల్లాలో రెండు సీట్లకు పరిమితం అయ్యింది. మెట్ట ప్రాంతంలో జిల్లా కేంద్రంగా ఉన్న ఏలూరులో ఇటు ఎంపీ, అటు ఎమ్మెల్యే స్థానాల్లోనూ టీడీపీ ఓడిపోయింది. అయితే.. ఎన్నికలు జరిగిన కొద్దికాలానికే మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి హఠాన్మరణం చెందారు. ఇక్కడ బుజ్జి సోదరుడు బడేటి రాధాకృష్ణయ్య (చంటి)కు అవకాశం కల్పించారు. అయితే బుజ్జిలో ఉన్న దూకుడు ఇప్పుడు చంటిలో కనిపించడం లేదు. బుజ్జి మరణాంతరం సానుభూతి వర్కవుట్ అవుతుందనే చంద్రబాబు ఆయన సోదరుడికి నియోజకవర్గ పగ్గాలు ఇచ్చినా ఆయన అక్కడ టీడీపీని ఎంత వరకు నడిపిస్తారన్న దానిపై పార్టీ నేతల్లోనే అనేక సందేహాలు ఉన్నాయి. అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్న ఆళ్ల నానిని తట్టుకుని కేడర్‌ను నిలబెట్టే పరిస్థితి లేదు.ఇక, పార్లమెంటు స్థానంలో రెండున్నర దశాబ్దాలకు పైగా పాతుకుపోయిన మాజీ మంత్రి, మాజీ ఎంపీ మాగంటి బాబు 2019 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. దీనికితోడు అనారోగ్య కారణాలతో ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు. ఇక, ఇక్కడ నుంచి ఆయన తనకుమారుడు రాంజీని రాజకీయంగా నిలబెట్టాలని అనుకున్నా ఆయన ఆకస్మికి మరణంతో ఏలూరులో టీడీపీకి బలమైన నాయకుడు అంటూ లేకుండా పోయాడు. దీంతో ఇప్పుడు పార్లమెంటు స్థానంలోను, అసెంబ్లీ స్థానంలోనూ పార్టీ పరిస్థితి ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ఈ రెండు చోట్ల వచ్చే ఎన్నికల నాటికి గెలుపు మాట అటుంచితే టీడీపీని నిలబెట్టేందుకు కూడా బలమైన నేతలు లేని దుస్థితిలో టీడీపీ ఉంది.మరో మూడేళ్ల తర్వాత వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిపై కసరత్తు జరగాలని ఇప్పటి నుంచే నేతలు కోరుతున్నారు. బడేటి చంటి ఏలూరు ఇన్‌చార్జ్‌గా ఉన్నా ఆశించిన విధంగా పార్టీలో దూకుడు చూపించలేక పోవడం ప్రధానంగా మైనస్ అయిపోయింది. చంద్రబాబు అనేక కార్యక్రమాలకు పిలుపు ఇచ్చినా.. ఈయన నామ్ కే వాస్తే.. న్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కార్పోరేషన్ ఎన్నికల్లో పార్టీ ఓడిపోతుందని ముందే డిసైడ్ అయిన చంటి ఎన్నికలను సీరియస్‌గా తీసుకోలేదు.పార్లమెంటు పరిధిలోకి వస్తే.. వచ్చే ఎన్నికల నాటికి మాగంటి బాబు కూడా తప్పుకొనే పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి గత ఎన్నికల్లోనే ఆయన తప్పుకుందామని అనుకున్నారు.కానీ, అప్పట్లో చంద్రబాబు ఒత్తిడి తెచ్చి.. పోటీకి పెట్టారని ప్రచారం జరిగింది. సో.. ఇప్పుడు ఈయన కూడా టీడీపీ తరఫున పోటీకి దిగే పరిస్థితి లేదు. ఓవరాల్‌గా చూస్తే జిల్లా కేంద్రంలో ఈ రెండు స్థానాలకు ఇద్దరు బలమైన నేతలను వెతకాల్సిన బాధ్యత బాబుపై ఉంది. లేనిపక్షంలో ఇక్కడ పార్టీ బతికే పరిస్థితి లేదని పార్టీ నేతలు గగ్గోలు పెడుతున్నారు.