- సోషల్ మీడియాలో శివ సెల్ఫీ హల్‌చల్ ..
వేగంగా వస్తున్న ఎంఎంటీఎస్ ముందు సెల్ఫీ వీడియో దిగడానికి ప్రయత్నించి.. గాయపడిన యువకుడి తాజా వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సెల్ఫీ వీడియో ఘటనలో అతను తీవ్రంగా గాయపడినట్టు మొదట కథనాలు వచ్చాయి. అయితే, ఈ ఘటనలో అతనికేం పెద్దగా గాయాలు కాలేదని, అతను బాగానే ఉన్నాడంటూ స్నేహితులు ఆటపట్టించేలా ఉన్న ఈ తాజా వీడియో హల్‌చల్ చేస్తోంది.
వరంగల్ ఉర్సు కరీమాబాద్‌కి చెందిన కృష్ణమూర్తి కుమారుడు తోటం శివ(25) గత ఆదివారం బోరబండ ఎంఎంటీఎస్ స్టేషన్‌లో వేగంగా వస్తున్న రైలు ముందు సెల్ఫీ తీసుకునేందుకు యత్నించాడు. రైల్వే హోంగార్డ్ వారిస్తున్నా ఎడమ చేత్తో సెల్‌ఫోన్ పట్టుకున్న శివ కుడిచేత్తో రైలును చూపిస్తూ ఫోజు ఇచ్చాడు. ఇంతలో ఎంఎంటీఎస్ డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేక్ వేశారు. వేగం తగ్గిన రైలు వచ్చి శివ కుడిచేతిని ఢీ కొట్టింది. దీంతో పట్టాల పక్కన పడిపోయిన శివ తలకు రాయి తగలడంతో గాయపడ్డాడు. వెంటనే స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. సోమవారం భరత్‌నగర్ ఆర్పీఎఫ్ పోలీసులు శివకు సెల్‌ఫోన్ అప్పగించి అతడిపై కేసు నమోదు చేశారు. కౌన్సెలింగ్ అనంతరం రైల్వే కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం విధించిన రూ.500 జరిమానా శివ చెల్లించాడు. ఈ సెల్ఫీ ‘సైట్’ను నాంపల్లి రైల్వే ఎస్పీ జి.అశోక్‌కుమార్, ఇన్‌స్పెక్టర్ ఆదిరెడ్డి బుధవారం సందర్శించారు.
ఈ ఘటన ఇలా ఉండగా శివ తాజా వీడియో హల్‌చల్ చేస్తోంది. ఇతనికేం కాలేదు.. తినితాగి మంచిగా ఉన్నాడంటూ స్నేహితులు ఆటపట్టించేలా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను బట్టి శివకు పెద్దగా గాయాలు కాలేదని స్పష్టమవుతోంది. అయితే, ఇది వీడియోనేనా? లేక పాతదా? అన్నది నిర్దారణ కాలేదు. మొత్తానికి ఈ వీడియోతోపాటు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.