కాకినాడ
కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావు పేట సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల యాభై నిమిషాల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జరగనున్న పెళ్లికి వరుడు తో సహా 37 మంది కుటుంబ సభ్యులు బస్సులో విజయనగరం నుంచి ఏలూరు ప్రయాణమయ్యారు. అయితే మార్గంమధ్యలో గండేపల్లి మండలం నీలాద్రి రావు పేట పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడింది. ఈ బస్సులో పెళ్లి కొడుకు తో సహా 36 మంది కి గాయాలు కాగా ఒకరి పై ఒకరు పడడంతో పెళ్లి కొడుక్కి వరుసకు పెదనాన్న అయన గుడిపాటి వెంకట కోదండరామయ్య అనే వ్యక్తి ఊపిరి ఆడకపోవడంతో బస్సులోనే మృతిచెందారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వైద్య సేవ నిమిత్తం రాజానగరం జిఎస్ఎల్ హాస్పిటల్ కి తరలించారు. జగ్గంపేట సిఐబి సూర్య అప్పారావు, గండేపల్లి ఎస్సై గణేష్ లు ప్రమాద స్థలాన్ని పరిశీలించి, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.