YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

చేప కష్టాలు చేపవి..

చేప కష్టాలు చేపవి..

జిల్లాలోని దిగువమానేరు చెంతన ఉన్న ‘చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని పట్టించుకునే నాథుడు లేడు. మత్స్యశాఖ ప్రగతికి ఓ వైపు సర్కారు పెద్దపీట వేస్తున్న తరుణంలో ఏళ్లనాటి కలగా చెప్పుకొనే ఇక్కడి ప్రగతి     విషయంలో మీనమేషాలు లెక్కించాల్సి వస్తోంది. రూ.3.58 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులు  చేపట్టే విషయంలో దిగాలు దరి   చేరుతోంది. ఈ మేలోనే పనులు  పూర్తయితే వచ్చే వానాకాలంలో మత్స్య కళను మరింతగా పెంపొందించేందుకు వీలైన వాతావరణం ఉంటుంది.  జిల్లాకేంద్రంలో ఉన్న ఈ ఉత్పత్తి పెంపకం కేంద్రంలో 2017-18 సంవత్సరానికి 6 కోట్ల చిచ్చురు చేపపిల్లలు(స్పాన్‌) ఉత్పత్తిని సాధించాలనే లక్ష్యం విషయంలో పురోగతి కనిపించడం లేదు.. దిగువ మానేరు జలాశయం నుంచి అందే నీరు పుష్కలంగానే ఉన్నప్పటికీ అవసరమైన సౌకర్యాల కల్పన విషయంలో అభివృద్ధి అనుకున్నట్లు లేకపోవడంతో ఇబ్బంది కనిపించింది. దీంతో 1.98 కోట్ల చేప పిల్లల్ని ఉత్పత్తి చేయగలిగారు. ఇప్పటివరకు గుర్తించిన సమస్యల్ని తీర్చడంతోపాటు ఈ కేంద్రంలో వసతుల కల్పనకు మత్స్యశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. గతంలోనే అవసరమైన పనుల విషయానికి అంచనాలు పంపించి కొత్త నర్సరీల నిర్మాణం, ఇతర పనుల కోసం ప్రతిపాదనలు పంపగా రూ.3.58 కోట్ల నిధులు మంజూరయ్యాయి.. ఇందుకు సంబంధించి పనులు ప్రారంభమైనా నిధులు సకాలంలో విడుదలవ్వకపోవడం, గుత్తేదారు చేపట్టిన పనుల తాలూకు బిల్లుల్ని చెల్లించకపోవడంతోనే పనులు మందగించినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ ఏడాదిలో ఇక్కడి కేంద్రంలో చేపపిల్లల ఉత్పత్తి పెంపకానికి ఇది అవరోధంగా మారనుంది. ఇక్కడి చేపలను జిల్లాలోని 279 చెరువుల్లో పెంచడం ద్వారానే జీవనోపాధి పొందుతున్న 162 మత్స్యసహకార సంఘాల్లోని 11,402 మంది సభ్యులపై ఇది పరోక్ష ప్రభావాన్ని చూపనుంది. దీంతోపాటు ఇతర జిల్లాలకు చేపపిల్లల్ని రవాణా చేసే చర్యలకు ఇబ్బంది కలుగనుంది.

ప్రస్తుతం ఇక్కడి క్షేత్రంలో పాత నర్సరీ కుంటలు 60 వరకు ఇవేకాకుండా కొత్తగా 70 నిర్మించాల్సి ఉండగా ఇందులో 57 పూర్తయ్యాయి. వీటికి అనుసంధానించాల్సిన పైపుల విషయంలో అనుకున్న ప్రగతిజాడలు కనిపించడంలేదు. శిథిలావస్థకు చేరిన వాటితోపాటు మిగతా2లో.. బలహీనంగా ఉన్నవాటిని బాగుచేయడం, లీకేజీలను అరికట్టడం సహా సమగ్ర అభివృద్ధిని వీటి చెంతన చేపట్టాల్సి ఉంది. అనుకున్న విధంగా కాలువల నిర్మాణం సహా ఇతర పనుల్ని చేపట్టకపోతే కుంటలకు నీళ్లు అందని పరిస్థితి తలెత్తనుంది. జూన్‌ ఆఖరు వారంలో వానలు పడే వీలున్నందున అప్పటివరకు ఇక్కడ పనులన్నీ పూర్తవ్వాల్సి ఉంది. కొన్నిచోట్ల నర్సరీ గోడలు మరమ్మతు కావాలి. ప్రహరీ నిర్మాణం చేపట్టాలి. చేసిన పనులకు ఎప్పటికప్పుడు బిల్లుల్ని అందిచకపోవడంతోనూ గుత్తేదారు నిరాసక్తత చూపించాల్సి వస్తోంది.

 పనుల విషయంలో సంబంధిత పర్యవేక్షణ అధికారులు చొరవ చూపాల్సి ఉంది. ఇక్కడ రూ.23 లక్షలతో నిర్మించిన అక్వాల్యాబ్‌- శిక్షణ కేంద్రం భవనం అలంకార ప్రాయంగానే మిగిలింది. దీన్ని వీలైనంత తొందరగా వినియోగంలోకి తెచ్చేలా చూడాలి. రూ.40లక్షలతో నిర్మించాలనుకున్న చైనీస్‌ హ్యారీస్‌తోపాటు రూ.25.4లక్షల విలువైన ట్యాంకు నిర్మాణం కొసరు పనుల్ని పూర్తిచేయించాలి. ప్రస్తుతం తాత్కాలికంగా ఉన్న బావిలోకి దిగువమానేరు ద్వారా నీటిని తీసుకొచ్చి నింపుతున్నారు. ఈ ట్యాంకుని అందుబాటులోకి తెస్తే ఇక్కడ నీటి వసతికి మరింత మేలు జరగనుంది. మరోవైపు ఇక్కడ ఉన్న బీడర్‌ పాండ్స్‌లో పూడిక మట్టిని మరింత లోతుకు తీయాల్సిన అవసరముంది.

Related Posts