గువాహటీ
అస్సాం రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని మెజార్టీ ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. 27 జిల్లాల్లో 6.62 లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారు. వేలాది మంది తమ నివాసాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. అనేక ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల రైల్వే లైన్లు వరదలధాటికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాలు, వదరల కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో పశువులు మరణించాయి. ఒక్క నాగౌన్ జిల్లాలోనే 2.88 లక్షల మంది భారీ వర్షలు, వరదలకు ప్రభావితులయ్యారు. కచర్ జిల్లాలో 1.19 లక్షల మంది, హోజాయి జిల్లాలో 1.7 లక్షల మంది, డర్రంగ్ జిల్లాలో 60,562 మంది, బిశ్వనాథ్ జిల్లాలో 27,282 మంది, ఉదల్గురి జిల్లాలో 19,755 మంది ప్రజలు వర్షాలు, వరదల బాధితులుగా మారారు.