రాష్ట్రమంతా ఇప్పటికే రాజకీయ వాతావరణం వేడెక్కింది. కానీ... ఆ మూలనున్న శ్రీకాకుళం జిల్లా మాత్రం దీనికి మినహాయింపు. సూర్యనారాయణుడు వెలిసిన ఈ జిల్లా... తెలుగుదేశం ఆవిర్భావం నుంచి అత్యధిక ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతుగా నిలిచింది. మెజారిటీ నియోజకవర్గాల్లో టీడీపీ నాయకత్వం బలంగా పాతుకుపోయి ఉండటం... వారిని సరిజోడుగా ఢీకొనే అభ్యర్థులను వైసీపీ రంగంలోకి దించలేకపోవడంతో శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికి రాజకీయ వాతావరణం అంతగా జోరందుకోలేదు. రెండు మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల విషయంలో టీడీపీ తర్జనభర్జన పడుతుండగా... వైసీపీలో మెజారిటీ నియోజకవర్గాల్లో ఆ పరిస్థితి నెలకొంది.
టీడీపీ దివంగత సీనియర్ నేత కింజరాపు ఎర్రన్నాయుడు వారసునిగా రంగంలోకి వచ్చిన ఆయన తనయుడు రామ్మోహన్ ప్రస్తుతం శ్రీకాకుళం ఎంపీగా ఉన్నారు. ఇంగ్లిష్, హిందీల్లో మంచి వాగ్ధాటి ప్రదర్శిస్తూ... ఎంపీగా మంచి పేరు తెచ్చుకున్నారు. జిల్లాలో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. తన నియోజకవర్గ పరిధిలోని మెజారిటీ అసెంబ్లీ సీట్లలో ఎమ్మెల్యే అభ్యర్థులు బలంగా ఉండటంతో ఆయన పరిస్థితి స్థిమితంగా ఉంది. ఆయనకు దీటైన అభ్యర్థిని వైసీపీ ఇంతవరకూ రంగంలోకి దించలేకపోయింది. పోయినసారి ఆ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన రెడ్డి శాంతి ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని నిర్ణయించుకొన్నారు. ఆమెకు పాత పట్నం అసెంబ్లీ టికెట్ ఖరారైనట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ కు చెందిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణిని వైసీపీలోకి తీసుకువచ్చి ఎంపీగా నిలపాలని కొందరు వైసీపీ నేతలు ప్రతిపాదించారు. కానీ ఏ కారణంవల్లో దానిపై ఇంతవరకూ కదలిక రాలేదు. ఆమె కూడా అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
దీంతో ఎంపీ అభ్యర్థి కోసం ఆ పార్టీలో ఇంకా అన్వేషణ కొనసాగుతోంది. ఇక... ఎర్రన్నాయుడు సోదరుడు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మళ్లీ టెక్కలి నుంచి పోటీ చేయనున్నారు. మంత్రిగా ఆయన నియోజకవర్గంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకొన్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ ఇన్‌చార్జులు మారుతూ వస్తున్నారు. మొదట దువ్వాడ శ్రీనుకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. తర్వాత ఆయనను మార్చి పేడాడ తిలక్‌కు అప్పగించారు. ఇప్పుడు కిల్లి కృపారాణి పేరు వినిపిస్తోంది. ఆమె అయినా వస్తారో రారో తెలియని అనిశ్చితి ఆ పార్టీలో నెలకొంది.
మంత్రి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఎచ్చెర్ల నుంచి మరోసారి పోటీ చేయనున్నారు. జిల్లా రాజకీయాల్లో సీనియర్ అయిన కళా వెంకట్రావు వ్యవహారాలను లౌక్యంతో సాఫీగా నడిపిస్తున్నారు. పోయిన ఎన్నికల్లో ఆయనపై పోటీ చేసిన వైసీపీ నేత గొర్లె కిరణ్ కుమార్ ప్రస్తుతం ఆ పార్టీకి నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు. పొరుగున ఉన్న విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను ఈ నియోజకవర్గం టికెట్‌పై దృష్టి పెట్టినట్లు కొత్తగా వినిపిస్తోంది. దీనితో వైసీపీ అభ్యర్థి ఎవరు అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆముదాలవలసలో సమీప బంధువులైన పాత ప్రత్యర్థుల మధ్యే మరోసారి పోరు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. టీడీపీ నుంచి మళ్లీ రవి కుమార్ పోటీ చేస్తున్నారు. టీడీపీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి తర్వాత వైసీపీలో చేరిన తమ్మినేని సీతారాం ఇప్పుడు ఆ నియోజకవర్గం వ్యవహారాలు చూస్తున్నారు. అక్కడి టికెట్ ఆయనకే ఖరారైందని చెబుతున్నారు. ఇక్కడ చేజారిన తన పట్టును తిరిగి సాధించడానికి సీతారాం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర్ శివాజీ రిటైర్ కాబోతున్నారు. ఆ స్థానాన్ని వచ్చే ఎన్నికల్లో తన కుమార్తె శిరీషకు ఇవ్వాలని ప్రతిపాదించారు. పార్టీ అధిష్ఠానం కూడా దానికి ఆమోదం తెలిపింది. శిరీష ప్రస్తుతం పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేస్తూ కొంత పేరు తెచ్చుకొన్నారు. కార్యకర్తల మొగ్గు ఇప్పటికీ శివాజీ వైపే ఉన్నా వయోభారంతో ఆయన తప్పుకోవాలనే నిర్ణయించుకొన్నారు. ఆయన తన కుమార్తెను ఎంపిక చేయడంపై అలిగి... మునిసిపల్ చైర్మన్ బయటకు వెళ్లిపోయారు. దీనికి ప్రతిగా అవతలి పార్టీ నుంచి కొందరిని టీడీపీలో చేర్చుకొన్నారు. ఈ నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జిగా ప్రస్తుతం సీదిరి అప్పలరాజు ఉన్నారు. టీడీపీ నుంచి బయటకు వచ్చి వైసీపీలో చేరిన మునిసిపల్ చైర్మన్ పూర్ణచంద్రరావుతో ఆయనకు పోటీ ఎదురవుతోంది. నరసన్నపేటలో టీడీపీ సిటింగ్ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మళ్లీ పోటీ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. ఎర్రన్నాయుడు కుటుంబానికి చెందిన వారు ఇక్కడ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతున్నా... ఇక్కడ రమణమూర్తి బలంగా ఉండటంతో మార్పు ఉండే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సోదరుడు కృష్ణ దాస్ ఉన్నారు. ఆయనకు కొంత పట్టు తక్కువ అన్న అభిప్రాయం ఉన్నా ఆ పార్టీకి మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు.
ఇచ్ఛాపురంలో టీడీపీ సిటింగ్ ఎమ్మెల్యే బెందాళం అశోక్ నియోజకవర్గంలో కొంత ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నా... తిరిగి ఆయనే పోటీ చేయవచ్చని అంటున్నారు. కింది స్థాయి నేతలతో పొసగకపోవడం ఆయనకు ఇబ్బందిగా మారింది. వైసీపీ నుంచి పిరియా సాయిరాజ్ ఇటీవల టీడీపీలో చేరే ప్రయత్నం చేశారు. ఆయన చేరితే టికెట్‌కు పోటీ ఏర్పడే ప్రమాదం వస్తుందని గుర్తించి ఇతర నాయకుల సహకారంతో అడ్డుకోగలిగారు. దీంతో అశోక్‌కు ప్రస్తుతం పోటీ కనిపించడంలేదు. ఇక... వైసీపీకి ఈ నియోజకవర్గంలో ఇద్దరు ఇన్‌చార్జిలు ఉన్నారు. నర్తు రామారావు, షిరియా సాయిరాజ్‌లలో... సాయిరాజ్‌కు నియోజకవర్గంలో పట్టు ఉన్నా టీడీపీలోకి వెళ్లాలని ప్రయత్నించడం మైన్‌సగా మారింది. దీంతో వైసీపీ టికెట్ ఎవరికి వస్తుందన్నది అస్పష్టంగా ఉంది.
శ్రీకాకుళం జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో అధికార పార్టీలో అస్పష్టత నెలకొంది. పాతపట్నం నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే కలమట రమణ అనుభవరాహిత్యంతో నియోజకవర్గంలో టీడీపీ రెండుగా చీలిపోయింది. మొదటి నుంచి టీడీపీలో ఉన్నవారు ఆయనతో పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలన్నది ఆ పార్టీకి సమస్యగా మారింది. ఎంపీ రామ్మోహన్, మంత్రి అచ్చెన్నాయుడు వారి మధ్య సర్దుబాటు తేగలిగితే సమస్య పరిష్కారం అవుతుందని, లేని పక్షంలో ముదిరిపోతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ వైసీపీ నుంచి రెడ్డి శాంతి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.. టీడీపీ నుంచి అప్పలనాయుడు కూడా టికెట్ ఆశిస్తున్నారు. వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజాం నియోజకవర్గంలో రెండు పార్టీల పరిస్థితి అయోమయంగా ఉంది. వైసీపీ ఎమ్మెల్యే రాజకీయంగా అంత బలంగా లేరు. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి పోయినసారి ఇక్కడ టీడీపీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. తిరిగి ఆమెను అక్కడ నిలపాలా వద్దా అన్నదానిపై పార్టీ ముఖ్యుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాంగ్రె్‌సకు చెందిన కొండ్రు మురళిని టీడీపీలోకి తీసుకువచ్చి టికెట్ ఇవ్వాలని కొందరు నేతలు ప్రతిపాదిస్తున్నారు. కానీ, ఆయన చేరికను మరో వర్గం వ్యతిరేకిస్తోంది. టీడీపీలో చేరని పక్షంలో మురళిని తమ పార్టీలోకి తీసుకురావాలని వైసీపీలో ఒక వర్గం భావిస్తోంది. సిటింగ్ ఎమ్మెల్యేకు టికెట్ కాదనడం సరికాదని మరో వర్గం వాదిస్తోంది.
పాలకొండ నియోజకవర్గంలో వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యే కళావతి చురుగ్గా పనిచేస్తున్నారు. ఆ పార్టీ నుంచి ఆమే మళ్లీ పోటీ చేయనున్నారు. అక్కడ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా జయకృష్ణ ఉన్నారు. ఆయన కంటే మెరుగైన అభ్యర్థి కోసం ఆ పార్టీ నాయకత్వం అన్వేషిస్తోంది.
జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో టీడీపీ సిటింగ్ ఎమ్మెల్యేగా గుండ లక్ష్మీదేవి ఉన్నారు. సీనియర్ మాజీ ఎమ్మెల్యే గుండ అప్పల సూర్యనారాయణ ఆమె భర్త. మళ్లీ టికెట్ వచ్చే సూచనలు ఉన్నా... ఇతరనేతలతో సమన్వయం లోపించడం ఆమెకు సమస్యగా మారింది. కళా వర్గంలో ఉన్న ఆమెకు ఎర్రన్నాయుడు వర్గానికి చెందిన వారితో దూరం పెరిగింది. సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ఈ నియోజకవర్గంలో వైసీపీకి ఇన్‌చార్జిగా ఉన్నారు.