పాట్నా, మే 20,
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ మరో స్కామ్‌లో చిక్కుకున్నారు. రైల్వే జాబ్స్ స్కాంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబ్బంది శుక్రవారం ఉదయాన్నే లాలూ ప్రసాద్, ఆయన భార్యా, కుమార్తె నివాసాలతోపాటు ఢిల్లీ, బీహార్‌లోని పలు ప్రాంతాల్లో 17 చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆర్ఆర్‌బీ రిక్రూట్మెంట్ లో జరిగిన అవినీతి, అక్రమాలపై లాలూప్రసాద్ యాదవ్‌తో పాటు ఆయన కుమార్తెలపై సీబీఐ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఈ కేసు ప్రాథమిక విచారణలో అవినీతి జరిగినట్లు తేలడంతో సీబీఐ దాడులు నిర్వహిస్తోందని పేర్కొంటున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ 2004 నుంచి 2009 వరకు రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలో జరిగిన రిక్రూట్‌మెంట్‌లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై తాజా అవినీతి కేసులో అభియోగాలు నమోదయ్యాయి. దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన గత నెలలో జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఫిబ్రవరిలో ఆయనకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.60 లక్షల జరిమానా కూడా విధించింది.