కర్ణాటకలో నిన్న అధికారం చేపట్టిన భాజపా రేపు చేపట్టే బలనిరూపణ కోసం కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోన్న నేపథ్యంలో ఆ పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో బెంగళూరు విమానాశ్రయంలో కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, మాజీ సీఎం సిద్ధరామయ్య, ఆరుగురు ఎమ్మెల్యేలు పడిగాపులు కాస్తున్నారు. హైదరాబాద్‌కు బయల్దేరిన నేతలు మధ్యాహ్నం 2 గంటల నుంచి బెంగళూరు విమానాశ్రయంలోనే ఉండిపోయారు. విమానంలో కూర్చున్నాక కూడా అధికారులు వారికి అనుమతి ఇవ్వలేదు. రాత్రి సైతం ఎయిర్‌పోర్టు అధికారులు ఇదే తరహా వైఖరి ప్రదర్శించారు. విమానం ల్యాండింగ్‌కు పౌర విమానయాన శాఖ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో ఇరు పార్టీల ఎమ్మెల్యేలను బస్సుల్లో హైదరాబాద్‌కు తరలించారు. బెంగళూరు నగర శివారులోని ఈగల్టన్ రిసార్టులో ఉన్న తమ ఎమ్మెల్యేలను నిన్న రాత్రికి రాత్రే హైదరాబాద్‌లోని స్టార్ హోటళ్లకు తరలించిన సంగతి తెలిసిందే.కాగా యడ్యూరప్ప సర్కార్ శనివారం సాయంత్రం బలనిరూపణ చేసుకోవాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ స్వాగతించారు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేలా ఉన్నాయని, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించేలా ఉన్నాయని ఆయన అభివర్ణించారు. కర్ణాటకలో బీజేపీ అనుసరిస్తున్న తీరును తప్పుపట్టారు. ప్రభుత్వాల ఏర్పాటులో మేఘాలయా, గోవా, మణిపూర్‌లలో ఒక నియమం, కర్ణాటకలో మరో నియమమా అని ప్రశ్నించారు.కర్ణాటకలో ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం లేదని, ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీని గవర్నర్ ఆహ్వానించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. బలనిరూపణ కోసం గవర్నర్ యడ్యూరప్పకు 15 రోజుల గడువు ఇవ్వడం విస్మయం కలిగిస్తోందన్నారు. కాగా, ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని సుప్రీం పేర్కొన్నందున అత్యంత సీనియర్ ఎమ్మెల్యేనే ప్రొటెం స్పీకర్‌గా నియమించాలని సూచించారు.