ఏలూరు, మే 21,
టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు పొడుపు కోసం యావత్ ఆంధ్రప్రదేశ్ ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. జగన్ రాక్షస పాలన అంతం కావాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కాపాడుకోవడమొక్కటే మార్గమని సాధారణ జనం సైతం విశ్లేషణలు చేస్తున్నారు. రాజకీయాలలో తలపండిన నేతలు సైతం చాలా సీరియస్ గా పొత్తు పొడిస్తే లాబాలేమిటి? లేకుంటే నష్టాలేమిటి వంటి లెక్కలు వేస్తున్నారు. దాదాపు రాజకీయాలకు గుడ్ బై చెప్పి సైలంట్ గా ఉన్న సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరిరామ జోగయ్య కూడా తెలుగుదేశం, జనసేనల పొత్తు పొడుపుపై ఉత్సుకతతో ఉన్నారు.రాజకీయ అనుభవమే కాకుండా ఆయనకు మరో ప్రత్యేకత కూడా ఉంది. కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ వరకూ అన్ని పార్టీలలో ఆయన పని చేశారు. ఐదు దశాబ్దాల రాజకీయ అనుభవమే కాకుండా.. గోదావరి జిల్లాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగిన కాపు సామాజిక వర్గం ఆయనను ఒక పెద్ద దిక్కుగా భావిస్తుంటుంది. ఇప్పుడు ఆయన ఆ పెద్దరికాన్ని చూపుతూనే పవన్ కల్యాణ్ కు బహిరంగ లేఖ రాశారు. కాపు సంక్షేమ సేన తరఫున ఆ బహిరంగ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కాపు సంక్షేమ సేన నేతగానే కాకుండా.. ఏదో వాత్సల్యం ఆయనకు జనసేనాని పవన్ కల్యాణ్ మీద ఉన్నట్లు కనిపిస్తుంది.పవన్ కల్యాణ్ జసనేస పార్టీ పెట్టినప్పటి నుంచీ మాజీ మంత్రి హరిరామ జోగయ్య సలహాలూ, సూచనలూ ఇస్తూనే వస్తున్నారు. అయితే ఈ సారి మాత్రం చాలా సీరియస్ గా ఆయన జనసేనానికి గైడ్ చేయాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంతకీ చేగొండి హరిరామ జోగయ్య తాజాగా పవన్ కు బహిరంగ లేఖ రూపంలో ఇచ్చిన సలహా ఏమిటంటే.. వైసీపీ రెచ్చగొట్టే ప్రకటనల వలలో పడి తెలుగుదేశం పార్టీకి దూరం కావద్దని. తెలుగుదేశంతో పొత్తు ఉంటేనే వైసీపీని అధికారానికి దూరం చేయడం సాధ్యమౌతుందని. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే రాష్ట్రంలో పొత్తు పొడుపులు ఉంటేనే ప్రజాకాంక్ష నెరవేరుతుందని చేగొండి హరిరామ జోగయ్య పవన్ కు కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ఆవేశంతో పొత్తుకు దూరం జరగద్దని సలహా ఇచ్చారు. వస్తే గిస్తే బీజేపీనీ కలుపుకు పొమ్మని చెప్పారు. దమ్ముంటే ఓంటరి పోరంటూ వైసీపీ చేస్తున్న కవ్వింపులు ఆ పార్టీ రాజకీయ ప్రయోజనం కోసం చేస్తున్నవేనని, అందుకే కవ్వింపులకు రెచ్చిపోకుండా సంయమనంతో ఆలోచించి, దార్శనికతతో నిర్ణయం తీసుకోమని సలహా ఇచ్చేశారు. చేగొండి లేఖపై పవన్ కల్యాణ్ సీరియస్ గా ఆలోచిస్తున్నారనీ, సన్నిహితులతోనూ పార్టీ నేతలతోనూ తెలుగుదేశంతో పొత్తుపై సీరియస్ మంతనాలు జరుపుతున్నారనీ జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పవన్ కల్యాణ్ ప్రజా వ్యతిరేక ఓటు చీల నివ్వరాదని వచ్చిన నిర్ణయానికి చేగొండి లేఖ మరింత బలం చేకూర్చిందని అన్నారు. జనసేన అధికారంలోకి రావాలంటే ముందుగా రాష్ట్రంలో బలోపేతం కావాలనీ, అందుకు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటేనే మేలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. గత ఎన్నికలలో పొత్తు లేకుండా పోటీ చేయడం వల్లనే ప్రతికూల ఫలితాలు వచ్చాయని ఆయన అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు.