YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సోదాలు...వార్నింగ్ లు...

సోదాలు...వార్నింగ్ లు...

పాట్నా, మే 21,
బీహార్‌ రాజకీయాలు ఊహించని మలుపు తిరుగుతున్నాయి. ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ ఇంట్లో ఐటీ సోదాల తరువాత ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. జేడీయూకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో నితీష్‌కుమార్‌ అత్యవసర భేటీ నిర్వహించారు. అతి త్వరలో తాను కఠిన నిర్ణయం తీసుకోబోతున్నానని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి మానసికంగా సిద్దంగా ఉండాలని సూచించారు. ఓవైపు లాలూ ఇంట్లో సీబీఐ సోదాలు జరుగుతున్న వేళ నితీష్‌ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. తన పాతమిత్రుడు లాలూకు నితీష్‌కు దగ్గరవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా బీజేపీతో కలిసి బీహార్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికి ఆ పార్టీ నేతలతో గ్యాప్‌ పెరిగిందని అంటున్నారు. ముఖ్యంగా బీహార్‌లో కులాల వారిగా జనాభా లెక్కలు నిర్వహించాలని అటు ఆర్జేడీతో పాటు ఇటు జేడీయూ నేతలు కూడా డిమాండ్‌ చేస్తున్నారు. ఆర్జేడీ-జేడీయూ మధ్య మళ్లీ స్నేహం చిగురిస్తుందన్న అనుమానంతోనే సీబీఐ దాడులు జరిగినట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నితీష్‌కుమార్‌కు తాజా సీబీఐ దాడులు ఓ హెచ్చరికగా భావించాలని అంటున్నారు. కొద్దిరోజుల క్రితం రంజాన్‌ సందర్భంగా జరిగిన ఇఫ్తార్‌ విందులకు నితీష్‌ పాటు లాలూ తనయుడు తేజస్వి యాదవ్‌ కలిసి హాజరయ్యారు. అప్పటినుంచి నితీష్‌కుమార్‌ తీరుపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నితీష్‌కుమార్‌ తాజా భేటీలో కేవలం జేడీయూ మంత్రులకు మాత్రమే ఆహ్వానం ఉంది. బీజేపీ మంత్రులకు ఆహ్వానం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో నితీష్‌కుమార్‌ ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా.. ఈ పరిణామాలపై.. బీజేపీ నేతలు నిశితంగా గమనిస్తున్నారు. దీంతో బీహార్ రాజకీయం రసవత్తరంగా మారింది.

Related Posts