చెన్నై, మే 21,
వందే భారత్ రైళ్ల కర్మాగారాన్ని తనిఖీ చేశారు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తమిళనాడు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీని సందర్శించి అక్కడ తయారు చేస్తున్న వందే భారత్ రైళ్ల పురోగతిని సమీక్షించారు. ఐసిఎఫ్ చెన్నైలో 12,000వ ఎల్‌హెచ్‌బీ కోచ్‌ను జెండా ఊపి ప్రారంభించారు. చెన్నై ఎగ్మూర్ స్టేషన్ పునరాభివృద్ధిని సమీక్షించారు. ఐఐటి మద్రాస్‌లో ‘హైపర్‌లూప్’ చాంఫియన్స్‌ను అభినందించారు మంత్రి. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిస్తున్న వందే భారత్ రైళ్లను తనిఖీ చేశారు. తన పర్యటనలో మంత్రి అశ్విని వైష్ణవ్ ఫ్యాక్టరీ కార్మికులను కలుసుకుని వారిలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. అక్కడి కార్మికులతో వ్యక్తిగతంగా మాట్లాడారు. పనులు జరుగుతున్న తీరును ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు కర్మాగారంలో జరుగుతున్న పనులను అధికారులు వివరించారు. అయితే.. పర్యటన అనంతరం చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వందే భారత్ రైళ్ల తయారీ ఫాస్ట్ ట్రాక్ మోడ్‌లో ఉందని వైష్ణవ్ ఒక ట్వీట్‌లో తెలిపారు.భారతీయ రైల్వే 2019 ఫిబ్రవరి 15న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇది సెమీ హైస్పీడ్ రైలు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు మాత్రమే ఉన్నాయి. ఒకటి కాన్‌పూర్, ప్రయాగ్‌రాజ్ మీధిగా ఢిల్లీ-వారణాసి రూట్‌లో, మరొకటి ఢిల్లీ కాట్రా రూట్‌లో నడుస్తోంది. మరో 10 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2022 నాటికి 75 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా 2022 ఆగస్ట్‌లో 10 సెమీ-హైస్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించాలని భారతీయ రైల్వే భావిస్తోంది.వచ్చే మూడేళ్లలో 400 వందేభారత్ రైళ్లను తయారు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. 2023 స్వాతంత్ర్య దినోత్సవం నాటికి భారతదేశం అంతటా 75 వందేభారత్ రైళ్లను నడపాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన ఆధారంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది మే నుంచి ఈ రైళ్లను ప్రారంభించాలనేది అసలు ప్రణాళిక. ఆగస్టు-సెప్టెంబరు నాటికి ప్రణాళిక ప్రకారం, ఐసిఎఫ్ చెన్నై, ఎంసిఎఫ్ రాయ్ బరేలీ మరియు ఆర్‌సిఎఫ్ కపుర్తలా మూడు ఉత్పత్తి యూనిట్లలో నెలకు ఐదు నుండి ఏడు రైళ్లు ఉత్పత్తి చేయబడతాయి