న్యూఢిల్లీ మే 21
లడఖ్‌లో ఉక్రెయిన్ తరహా పరిస్ధితిని చైనా సృష్టించిందని, ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. సరిహద్దుల్లో చైనాతో సమస్యలున్నాయని దీని పరిష్కారం కొరకు దేశం సన్నద్ధం కావాలని రాహుల్ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను లడఖ్‌లో చైనా దూకుడుతో పోలుస్తూ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.అమెరికాతో ఉక్రెయిన్ కూటమికి తాను సుముఖంగా లేనని అందుకే మీ ప్రాదేశిక సమగ్రతను గుర్తించబోమని అంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఉక్రెయిన్‌పై కయ్యానికి కాలుదువ్వాడని చెప్పారు. ఐడియాస్ ఫర్ ఇండియా సదస్సులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ సరిహద్దు సమస్యపై ప్రభుత్వం చర్చకు అనుమతించడం లేదని ఆరోపించారు. ఉక్రెయిన్‌లో ఏం జరుగుతుందో..లడఖ్, డోక్లాంలో ఏం జరుగుతుందో దయచేసి గమనించాలని హితవు పలికారు.లడఖ్, డోక్లాంలో చైనా సేనలు మోహరించాయని భారత ప్రాదేశిక సమగ్రతను తాము గుర్తించమని, అమెరికాతో భారత్ సంబంధాలను అంగీకరించమని డ్రాగన్ చెబుతోందని అన్నారు. సరిహద్దుల్లో సమస్యను మనం గుర్తించాలని, మనకు ఇష్టం ఉన్నా లేకున్నా ఈ సమస్యను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని అన్నారు. పాంగాంగ్ సరస్సుపై చైనా మరో వంతెన నిర్మాణం చేపడుతుందనే వార్తలను ప్రస్తావిస్తూ చైనా సేనలు భారత్ భూభాగంలో మోహరించి మౌలిక వసతులు నిర్మాణం చేపట్టాయని ఆందోళన వ్యక్తం చేశారు.