పాట్నా
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ సహా ఆయన కుటుంబ సభ్యులపై తాజా అవినీతి కేసులో సీబీఐ దాడులు చేపట్టడం పట్ల బిహార్ అసెంబ్లీలో విపక్ష నేత తేజస్వి యాదవ్ మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. సత్య మార్గంలో పయనించడం కష్టమైనా అసాధ్యం కాదని, జాప్యం జరిగినా చివరికి వాస్తవమే విజయం సాధిస్తుందని తేజస్వి యాదవ్ ట్వీట్ చేశారు. తాము ఈ పోరాటంలో విజయం సాధిస్తామని, గెలుపు లభించేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. లాలూ ఎన్నటికీ వెన్నుచూపడని, ఈ ప్రభుత్వాలకు ఆయన భయపడరని అన్నారు.
అవినీతి కేసులో బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీదేవి, లాలూ కుమార్తె మిసా భారతి నివాసాల్లో శుక్రవారం సీబీఐ అదికారులు సోదాలు నిర్వహించారు. లండన్‌లో ఓ కార్యక్రమంలో ప్రసంగించేందుకు లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ విదేశాలకు వెళ్లిన సమయంలో ఈ దాడులు జరిగాయి. కాగా, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ తాజా అవినీతి కేసులో చర్యలకు దిగడం ఊహించిందేనని ఆ పార్టీ వ్యాఖ్యానించింది. అధికారం చేజారుతుందని భావించిన ప్రతిసారీ కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను తన ప్రత్యర్ధులపై బీజేపీ ఉసిగొల్పుతుందని ఆరోపించింది. బిహార్‌లో బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ శక్తులను ఏకం చేసే ప్రయత్నాలు ఊపందుకోవడంతో లాలూ ప్రసాద్‌పై సీబీఐ తాజా దాడులకు దిగిందని ఆర్జేడీ ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ మనోజ్ కుమార్ ఝా పేర్కొన్నారు.