శ్రీకాకుళం, మే 23,
గడిచిన రెండు ఎన్నికలలోనూ వైసీపీకి ఉమ్మడి విజయనగరం జిల్లా ఏజెన్సీలో తిరిగులేని మెజారిటీని అందించారు జనం. ఇప్పుడు సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ సెగ్మెంట్లను కలుపుతూ కొత్తగా మన్యం జిల్లాను ఏర్పాటు చేసింది. జిల్లా వైసీపీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి. ఆ హోదాలో జిల్లా కేంద్రంలో మొదటి సమావేశం ఏర్పాటు చేశారు కూడా. ఈ సందర్భంగా ఫ్లెక్సీలతో నగరాన్ని ముంచేశారు. అంతా కలిసి సాగుతారు అని అనుకుంటున్న తరుణంలో నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మాజీ మంత్రి పుష్పశ్రీవాణి ఫ్లెక్సీల్లో మంత్రుల ఫొటోలు లేవట. గతానుభవాలను దృష్టిలో పెట్టుకునే ఇలా చేశారని చెవులు కొరుక్కున్నాయి పార్టీ శ్రేణులు.పార్వతీపురం మన్యం జిల్లా విభజనకు ముందు కాస్తో కూస్తో ఉన్న విభేదాలు.. ప్రస్తుతం తారాస్థాయికి చేరుకున్నాయి. ఇంతకుముందు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రి బొత్స సత్యనారాయణ అండర్‌లో ఉండేవారనే టాక్ ఉంది. విభేదాలున్నా బయట పడేవి కాదు. తాజాగా ఒకరంటే ఒకరికి పొసగడం లేదు. ఉప ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు పుష్పశ్రీవాణి తమను పట్టించుకోలేదని పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు అనుచరులు బాహాటంగానే తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఇటీవల పార్టీ మీటింగ్ కోసం జోగారావు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు పుష్పశ్రీవాణి ఫొటోలు పెట్టలేదు. సమావేశంలోనూ గ్యాప్ పాటించారట. పుష్పశ్రీవాణి వర్సెస్ జోగారావు వార్ ఇంకా కొనసాగుతోందని కేడర్‌కు అర్థమైపోయింది.డిప్యూటీ సీఎం రాజన్నదొరతోపాటు పాలకొండ ఎమ్మెల్యే కళావతి.. ఎమ్మెల్సీ విక్రంత్ కూడా తమకు ప్రాధాన్యం దక్కడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. తమ మధ్య ఉన్న విభేదాలను నర్మగర్భంగా మీటింగ్‌లో బయట పెట్టేశారు. రాజన్నదొర సైతం సమావేశానికి సహకరించ లేదట. గతంలో రాజన్నదొరని అన్నివిధాలా శ్రీవాణి అవమానించారని.. అందుకే ఇప్పుడు ఆయన కూడా అదే పనిచేస్తున్నారని పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి.దీంతో మన్యం జిల్లా వైసీపీలో విభేదాలు మరో రూపంలో బుసలు కొడుతున్నాయని చర్చ జరుగుతోంది. ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వీటిని గమనించిన మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి పెద్దరికం పాత్ర పోషిస్తారని.. అన్నీ చక్కదిద్దుతారని కేడర్ భావిస్తోందట. ఈ లోగా రివేంజ్ పాలిటిక్స్ ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.