కర్నేూలు, మే 23,
ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన భిన్నంగా జరిగింది. కేడర్ నుంచి వచ్చిన స్పందన చూశాక.. ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారో ఏమో.. డోన్ టీడీపీ అభ్యర్థిగా సుబ్బారెడ్డి పేరును ప్రకటించేశారు. ఈ స్టేట్‌మెంట్‌పై టీడీపీతోపాటు జనసేన కార్యకర్తలు కూడా ఆశ్చర్యపోయాయట. ఒక్క డోన్‌లోనే కాదు.. చంద్రబాబు తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం చర్చ మొదలైందివచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి రావాలని చూస్తున్న చంద్రబాబు.. కొన్ని రోజులుగా పొత్తులపై పదే పదే మాట్లాడుతున్నారు. అందరూ ఏకం కావాలని.. అవసరమైతే త్యాగాలకు సిద్ధమని ఆ మధ్య కాకినాడ పర్యటనలో స్పష్టం చేశారు కూడా. జనసేనతో కలిసి సాగాలని చంద్రబాబు బలంగా ఆకాంక్షిస్తున్నారు. కుప్పం పర్యటనలో ఒక కార్యకర్త అడిగిన ప్రశ్నకు వన్‌సైడ్ లవ్వు అంటూ బదులిచ్చి.. తన మనసులో మాటను బయటపెట్టారు. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా పార్టీ ఆవిర్భావ సభలో టీడీపీతో పొత్తుపై క్లారిటీ ఇవ్వకుండానే వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వబోనని చెప్పారు. అప్పటి నుంచి టీడీపీ, జనసేన దగ్గరవుతున్నాయని అంతా అనుకుంటున్నారు. పొత్తులపై అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. అయితే జనసేన బీజేపీతో పొత్తులో ఉంది. బీజేపీకి టీడీపీ అంటే పడటం లేదు. దీంతో ఈ మూడు పార్టీల కలయిక సాధ్యమా అనేది ప్రశ్న. ఒకవేళ బీజేపీ కలిసి రాకపోయినా టీడీపీ జనసేన కలిసి సాగుతాయనే ప్రచారం ఉంది. గత స్థానికసంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో పలుచోట్ల టీడీపీ, జనసేన అవగాహనతో పోటీ చేశాయి. వచ్చే ఎన్నికల్లో దానిని రిపీట్ చేయాలని చూస్తున్నాయి కూడా. ఇలాంటి తరుణంలో డోన్ విషయంలో చంద్రబాబు చేసిన ప్రకటన రెండు శిబిరాలను గందరగోళంలో పడేశాయి.పొత్తుల కోసం ఒకవైపు ఆలోచిస్తూనే ఇలా ఏకపక్షంగా రెండేళ్ల ముందే డోన్ టీడీపీ అభ్యర్థిని చంద్రబాబు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నిస్తున్నారట. పొత్తులు కుదిరితే ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాతే అభ్యర్థులపై ఒక స్పష్టత వస్తుంది. ఈ విషయం చంద్రబాబు తెలియంది కాదు. కానీ.. డోన్ విషయంలో గేర్ మార్చేశారు చంద్రబాబు. డోన్‌లోని జనసేన శ్రేణులకు ఈ ప్రకటన అస్సలు రుచించడం లేదట. ఈ తరహా ప్రకటనలతో పొత్తులు సాధ్యమా అని ప్రశ్నిస్తున్నారట. మొత్తానికి చంద్రబాబు స్టేట్‌మెంట్ రెండు పార్టీల్లోనూ కలకలం రేపాయి. ఆలోచనలో పడేశాయి. అందుకే ఇలా అయితే ఎలా అని టీడీపీ అధినేతను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నాయట టీడీపీ, జనసేన శ్రేణులు.