రాజమండ్రి, మే 23,
తూర్పుగోదావరి జిల్లాలో తనకంటూ.. ప్రత్యేక ముద్ర వేసుకున్న రాజకీయ నేత, డైనమిక్ నాయకుడిగా రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు, మూడున్నర దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో తన హవాను చాటుకున్న నేత.. బొడ్డు భాస్కర రామారావు తాజాగా మృతి చెందారు. కరోనా భారిన పడిన ఆయన కాకినాడలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఆయన లేకపోయినా.. ఆయన నడిచిన, ఆయన నడిపించిన రాజకీయాలు మాత్రం జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందాయి. బొడ్డు భాస్కర రామారావు ది మూడున్నర దశాబ్దాల రాజకీయ ప్రస్థానం. అనపర్తి తాలూకా, పెద్దపూడి మండలం, పెద్దాడకు చెందిన బొడ్డు భాస్కరరామారావుకు రాజకీయ జీవితంలో అనేక ప్రత్యేక సంఘటనలు ఉన్నాయి.దాదాపు 1980కు ముందే పదేళ్లపాటు బొడ్డు భాస్కర రామారావు కాంగ్రెస్‌లో చక్రం తిప్పారు. 1981లో సామర్ల కోట సమితి ప్రెసిడెంట్‌గా ఆయన వ్యవహరించారు. ఈ క్రమంలో అన్నగారు ఎన్టీఆర్ పిలుపు మేరకు అప్పుడు స్థాపించిన టీడీపీలోకి వచ్చారు. ఈ క్రమంలోనే జిల్లా పరిషత్ చైర్మన్‌గా 1984లో విజయం దక్కించుకున్నారు. కాపు, బీసీ వర్గాలు బలంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో కమ్మ వర్గం నుంచి కూడా ఆయన మూడున్నర దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. ఈ క్రమంలోనే తన హవాను పెంచుకుని.. 1994, 1999 ఎన్నిక్లలో రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం బొడ్డు భాస్కర రామారావు సాధించారు. ఈ క్రమంలో విప్‌గా ఆయన వ్యవహరించారు.రాజమండ్రి మేయర్ ఎన్నికల్లో నాడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చక్రవర్తిని గెలిపించేందుకు (ఆ ఎన్నికల్లో వైసీపీ మేయర్ అభ్యర్థి హర్షకుమార్) బొడ్డు భాస్కర రామారావు చేసిన పోరాటం, చూపిన తెగువ నాడు రాష్ట్ర వ్యాప్తంగా హైలెట్ అయ్యింది. 2009లో పెద్దాపురంలో ఓటమి తర్వాత ఆయన పనైపోయిందనుకున్న సమయంలో అనూహ్యంగా 2013లో టీడీపీ నుంచి జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఇలా జిల్లాలో టీడీపీని బలోపేతం చేయడంలోను ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. తర్వాత వైసీపీలోకి చేరిన బొడ్డు భాస్కర రామారావు తన వారసుడిగా.. కుమారుడు బొడ్డు వెంకటరమణ చౌదరిని తెరమీదికి తీసుకువచ్చారు. 2014లో రాజమండ్రి ఎంపీసీటును దక్కించుకున్నారు. అయితే.. ఆ ఎన్నికల్లో వెంకటరమణ చౌదరి మాగంటి మురళీ మోహన్ చేతిలో ఓడిపోయారు. టీడీపీ అధికారంలోకి రావడంతో.. మళ్లీ వైసీపీకి దూరమై.. టీడీపీలోకి చేరుకున్నారు.గత ఎన్నికలకు ముందు పెద్దాపురం టికెట్ ఇవ్వాలంటూ.. పెద్ద రగడే చేశారు. అయితే.. చినరాజప్ప చక్రం తిప్పడంతో చంద్రబాబు బొడ్డును పక్కన పెట్టారు. మరోవైపు 2014లో ఓటమితో ఆయన కుమారుడు వెంకట రమణ చౌదరి.. రాజకీయాలు వదిలేసి.. సాఫ్ట్ వేర్ రంగంలోకి వెళ్లిపోయారు. ఇక, ఆయనకు ఎవరూ వారసులు లేకపోవడంతో ఇప్పుడు ఇక, రాజకీయాలకు బొడ్డు భాస్కర రామారావు కుటుంబం దూరమైపోయినట్టే. కాగా, తూర్పు రాజకీయాల్లో చిరరాజప్ప, ముద్రగడ పద్మనాభం, హర్షకుమార్‌ను ఢీ అంటే ఢీ అనేరీతిలో ఎదుర్కొని మూడున్నర దశాబ్దాల పాటు బొడ్డు భాస్కర రామారావు స్ట్రాంగ్ పిల్లర్‌గా నిలబడ్డారు. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్‌తో బొడ్డు భాస్కర రామారావు శకం ముగిసింది.