YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నీళ్లండి... నీళ్లండి...నీళ్లు

నీళ్లండి... నీళ్లండి...నీళ్లు

గుంటూరు, మే 23,
గుంటూరు నగరాన్ని రాజధాని స్థాయిలో అభివృద్ధి చేస్తామంటూ ప్రకటనలు గుప్పించిన ప్రభుత్వం కనీస అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదు. రాజధాని నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా రోడ్ల విస్తరణ పనులు మాత్రం ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. వేసవి కాలం వచ్చిన ప్రతిసారి నగర ప్రజలకు దాహార్తిని తీరుస్తామంటూ అధికారులు ఊదరగొట్టడం మినహా చేసిందేమీ లేదు. 24 గంటలు మంచినీటి సరఫరా హామీ  నీటి మూటలుగానే మిగిలిపోయింది. నగరంలో ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటులోనూ అధికారులు అవినీతికి పాల్పడడంతో నాసిరకంగా పనులు జరిగాయనే విమర్శలు ఉన్నాయి. నగర ప్రజలు వాకింగ్‌ చేసి ఉల్లాసంగా గడిపేందుకు నగరంలోని పలు చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించినప్పటికీ అవి ప్రతిపాదన దశలోనే ఉండిపోయాయి. నూతన కమిషనర్‌ శ్రీకేష్‌ లఠ్కర్‌ అనధికారిక హోర్డింగ్‌ల తొలగింపుపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ పట్టణ ప్రణాళిక  విభాగం అధికారులు మాత్రం ఇందులో చేతివాటం ప్రదర్శిస్తూ కొన్ని హోర్డింగ్‌లను తొలగించకుండా వదిలేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయ కారణాలతో నిలిచిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూగర్భ డ్రెయినేజీ పనుల పేరుతో రోడ్లన్ని తవ్వి గుంతలమయంగా మార్చడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు నగరంలోని 14 ప్రధాన కూడళ్లలో రోడ్ల విస్తరణ చేసేందుకు నగరపాలక సంస్థ అధికారులు గతంలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ప్రస్తుతం కొరిటెపాడు, అమరావతి రోడ్డు, పొన్నూరు రోడ్డు, నందివెలుగు రోడ్డు, జీటీరోడ్డులను విస్తరించేందుకు రెండేళ్ల క్రితం పనులు ప్రారంభించారు. అయితే అవి అప్పటి నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల రాజకీయ జోక్యంతో నిలిచిపోయాయి. పనులు పూర్తి కాకపోవడంతో నగరంలో ట్రాఫిక్‌ సమస్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది.కృష్ణానది, ప్రకాశం బ్యారేజి నుంచి గుంటూరు నగరానికి పూర్తి స్థాయిలో నీరందించేందుకు  ప్రపంచ బ్యాంకు నిధులు రూ. 460 కోట్లతో 2012లో సమగ్ర తాగు నీటి సరఫరా ప్రాజెక్టును ప్రభుత్వం మంజూరు చేసింది.  2012, జూన్‌ 28న  పరిపాలన అనుమతులు ఇచ్చారు. సాంకేతిక అనుమతులు సైతం 2012,జూలైలోనే ఇచ్చి  టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు. పనులను రెండు ప్యాకేజీలుగా విడగొట్టారు. మొదటి ప్యాకేజి రూ.340 కోట్ల పనుల అంచనా కాగా రూ.277.02 కోట్ల అగ్రిమెంట్‌ విలువతో ఎన్‌సీసీ దక్కించుకుంది. పనులను ఫైనలైజ్‌ చేసి ఏజెన్సీకి అప్పగించటంలోనే తీవ్ర జాప్యం జరిగింది. రెండో ప్యాకేజి రూ.120 కోట్లు అంచనా కాగా నిర్మాణ సంస్థ రూ.88.50 కోట్ల అగ్రిమెంట్‌ విలువలతో పనులను దక్కించుకుంది. 2015, జూన్‌  నాటికి రెండో ప్యాకేజి పనులు పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. అదే సమయంలో ప్యాకేజ్‌–1కు సంబంధించిన పనులు 2016 మార్చిలోపు పూర్తి చేయాల్సి ఉంది.  90శాతం పనులు పూర్తయినప్పటికీ కీలకమైన పనులు మిగిలిపోవడంతో ఈవేసవిలో కూడా  ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు.

Related Posts