న్యూ ఢిల్లీ మే 23 : భారతదేశం 2030 నాటికి గుండెపోటు మరణాల్లో ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా నిలుస్తుందని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సీఎస్ మంజునాథ్ హెచ్చరించారు. ఇదే సమయంలో యువత, మధ్య వయస్కుల్లో గుండె సంబంధిత సమస్యలు పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. డాక్టర్ సీఎస్ మంజూనాథ్ జయదేవ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్. ఆయన ‘హెల్తీ మెడికాన్-2022’ అనే అంశంపై హెచ్‌ఏఎల్ వైద్యులకు సంబంధించిన జాతీయ సదస్సులో పాల్గొని, ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి, అలవాట్లను పెంపొందించుకోవాలని సూచించిన ఆయన.. ముప్పును ఎదుర్కొనేందుకు సమగ్ర విధానాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. శని, ఆదివారాల్లో హెచ్‌ఏఎల్ వైద్యుల సదస్సు జరగ్గా.. హెచ్‌ఏఎల్ సీఎండీ ఆర్ మాధవన్ ప్రారంభించారు.
గుండెపోటు ఎప్పుడు వస్తుంది ?
శరీరంలోని సిరల్లో రక్తప్రసరణ సజావుగా సాగకపోయి రక్తం గడ్డకట్టడం మొదలవుతుంది. దీని కారణంగా రక్తం గుండెకు చేరదు. అదే సమయంలో గుండెకు ఆక్సిజన్ అందడం కూడా ఆగిపోతుంది. ఈ పరిస్థితిలో గుండెపోటు వస్తుంది. గుండెపోటు కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. అయితే, సత్వర చికిత్స ఇస్తే రోగులను రక్షించవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.
వాయు కాలుష్యం కూడా కారణం..
దేశంలో వాయు కాలుష్యం తీవ్ర సమస్యగానే మరింది. దేశంలోని పలు నగరాల్లో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ ప్రచురితమైన ఓ నివేదిక ప్రకారం.. వాయు కాలుష్యానికి గురైన గంటలోనే ఓ వ్యక్తి గుండెపోటుకు గురవుతాడు. రోడ్లపై తిరిగే వాహనాలు, ఎలక్ట్రికల్ పరికరాలు, నిర్మాణ ప్రాంతాలపై వచ్చే దుమ్ము ధూళితో గాలిలో కాలుష్యం ఏర్పడుతుందని నివేదిక పేర్కొంది. వాయు కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 42 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.