బీజింగ్ మే 13
తైవాన్ ఆక్రమణకు చైనా వ్యూహం రచిస్తున్నట్లు బయటపడింది. 1.4 లక్షల మంది సైనికులు, 953 యుద్ధ నౌకలు, డ్రోన్లు, ఇతర ఆయుధాలతో సైనిక చర్యకు చైనా సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. దీనికి సంబంధించిన ఒక ఆడియో క్లిప్ లీక్ అయ్యింది. చైనాకు చెందిన మానవ హక్కుల కార్యకర్త జెన్నిఫర్ హెంగ్ ట్వీట్ చేసిన ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజింగ్‌లో ఇది ప్రకంపణలు సృష్టిస్తున్నది. చైనా అధికార పార్టీ నేతలు, ఆ దేశ టాప్ మిలిటరీ అధికారుల మధ్య జరిగిన ఈ సంభాషణకు చెందిన 57 నిమిషాల నిడివి ఉన్న ఆడియో క్లిప్‌ను లూడి యూట్యూబ్ ఛానెల్ పోస్ట్ చేసింది. తైవాన్‌పై సైనిక ప్రణాళికను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ బహిర్గతం చేసినట్లు దీని ద్వారా స్పష్టమవుతున్నది. ఈ ఆడియో క్లిప్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ), పీపుల్స్ లిబరేషన్ ఆఫ్ ఆర్మీ (పీఎల్‌ఏ) మధ్య జరిగిన సంభాషణలు ఉన్నాయి. సాధారణ స్థితి నుంచి యుద్ధ పరివర్తన వరకు తైవాన్‌పై సైనిక ప్రణాళిక, రోడ్‌మ్యాప్ అమలుపై ఈ ఉన్నత స్థాయి సమావేశంలో మాట్లాడుకున్నారు. గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని తూర్పు, దక్షిణ వార్‌జోన్‌ల ద్వారా తైవాన్‌పై సైనిక చర్యకు ప్లాస్ సిద్ధం చేసినట్లు అక్కడి సీపీసీ, పీఎల్‌ఏ అధికారుల మాటల ద్వారా తెలుస్తున్నది. 0.5 నుంచి 10 మీటర్ల గ్లోబల్ రిమోట్ అల్ట్రా-హై ఆప్టికల్ రిజల్యూషన్ సెన్సింగ్, ఇమేజింగ్ సామర్థ్యాలతో కూడిన తక్కువ కక్ష్యలో 16 ఉపగ్రహాలు ఉన్నట్లు ఒక అధికారి తెలిపారు.అలాగే 1.40 లక్షల మంది సైనిక సిబ్బంది, 953 నౌకలు, 1,653 యూనిట్ల మానవ రహిత పరికరాలు, 20 విమానాశ్రయాలు, డాక్‌లు, ఆరు మరమ్మత్తు, నౌకా నిర్మాణ యార్డులు, 14 అత్యవసర బదిలీ కేంద్రాలు, ధాన్యం డిపోలు, ఆసుపత్రులు, రక్త కేంద్రాలు, చమురు డిపోలు, గ్యాస్ స్టేషన్లు మొదలైన వనరుల వినియోగంపై చర్చించారు. భారీగా సైనిక రిక్రూట్‌మెంట్, 15,500 ప్రత్యేక ఆర్మీ శిక్షకులతోపాటు చైనా ప్రధాన, పారిశ్రామిక నగరాల భద్రత గురించి కూడా ఈ ఆడియో క్లిప్‌లో ఉన్నది.