హైదరాబాద్, మే 23,
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. సాధారణంగా అయితే 2024లో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ తాజా పరిస్థితులు చూస్తుంటే.. ఏడాది ముందే ఎన్నికలు వస్తాయనే ప్రచారం జరుగుతోంది. అన్ని రాజకీయ పార్టీలో అదే భావనలో ఉన్నాయి.. వైసీపీ నేతలు సైతం అంతర్గత సమావేశంలో ఇదే మాట చెబుతున్నారు. అందుకే అన్ని పార్టీలు ప్రస్తుతం ప్రజల్లోనే ఉంటున్నారు.. అధికార వైసీపీ గడప గడపకు ప్రభుత్వం పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు అంతా ప్రజల్లోనే ఉన్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు బాదుడే బాదుడు పేరుతో జిల్లాల బాట పట్టారు. మరోవైపు మహానాడు లోనే మేనిఫెస్టోలోని ముఖ్య అంశాలు చెబుతారనే ప్రచారం ఉంది. జనసేనాని పవన్ సైతం రైతు భరోసా పేరుతో గ్రామల బాట పడుతున్నారు. ఇలాం ఎవరి వ్యూహాల్లో వారు బీజీగా ఉన్నారు. తాజాగా మెగా అభిమానులంతా ఏకమయ్యారు. జనసేన అధినేత పవన్ ను సీఎం చేయడమే లక్ష్యంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు సైతం తీసుకున్నారు..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్రేజ్ ను మరింత పెంచడమే లక్ష్యంగా మెగా అభిమానులంతా సమావేశమైనట్టు సమాచారం. వచ్చే ఎన్నికలపై ఇప్పటి నుంచే ఫోకస్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. గత ఎన్నికలలో తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ జనసేన పార్టీ ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. ఆ ఒకే ఒక స్థానంలో ఉన్న ఎమ్మెల్యే కూడా జనసేనకు హ్యాండ్ ఇచ్చారు.. జై జగన్ అంటూ వైసీపీ పక్కన నిలబడ్డారు. ఈ సారి అలాంటి పరిస్థితి రాకూడదని మెగా అభిమానులు గట్టి పట్టుదలతో ఉన్నారు. అందులో్ భాగంగానే చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అభిమానులు కార్యాచరణ రూపొందించి జనంలోకి జనసేన పార్టీని తీసుకువెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడలో మురళి ఫార్చ్యూన్ హోటల్ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అభిమానులు సమావేశం నిర్వహించారు.మెగా కుటుంబంలో ఉన్న అందరి అభిమానులూ కలిసి జనసేన పార్టీకి మద్దతుగా నిలిస్తే పార్టీ బలోపేతం అవుతుందని చర్చించారు. ఏ విధంగా జనసేన పార్టీ కోసం మెగా ఫ్యాన్స్ ముందుకు వెళ్లాలి అన్నదానిపై కార్యాచరణ రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశాన్ని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామి నాయుడు అధ్యక్షతన నిర్వహించారు. ఇక ఈ సమావేశంలో జనసేన పార్టీని జనంలోకి తీసుకు వెళ్లేలా తమ వంతు కృషి చేయాలని, ప్రతి గ్రామంలోనూ అందరూ కలిసి పని చేయాలని నిర్ణయించినట్లుగా మెగా ఫ్యాన్స్ తెలిపారు.2024 లో పవన్ కళ్యాణ్ ను సీఎం చేయడమే తమ లక్ష్యమని వారు అభిమానులు ప్రకటించారు. మెగా ఫ్యామిలీ కోసం తాము కష్టపడటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పవన్ కళ్యాణ్ పార్టీ కోసం మొదటి సారిగా సమావేశమైన మెగా ఫాన్స్ మరికొన్ని సమావేశాలను నిర్వహించి కార్యాచరణ సిద్ధం చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని భావిస్తున్నారు. పార్టీ ఆదేశాలను పాటిస్తూ తాము ముందుకు వెళ్తామని మెగా ఫ్యాన్స్ వెల్లడించారు. ఇక పొత్తుల అంశంపై తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అధినేత పవన్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తామంతా కట్టుబడతామన్నారు. ఈ సమావేశం అంతా చిరంజీవి యూత్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామినాయుడు ప్లాన్ ప్రకారమే జరగడంతో.. ఇప్పుడు ఈ భేటీ వెనుక ఎవరు ఉన్నారన్నది చర్చనీయాంశంగా మారింది. ఇది అభిమానులు తీసుకున్న నిర్ణయమా? లేక మెగా అన్నయ్య చిరంజీవి ఆదేశాలతోనే జరిగిందా అన్న చర్చజరుగుతోంది. ఒకవేళ చిరంజీవే నేరుగా ఈ ఆదేశాలు ఇస్తే.. జనసేనకు భారీ ఊపు వచ్చినట్టే.. వచ్చి ఎన్నిక్లలో నేరుగా అన్నయ్య.. తప్పుడుకి సపోర్ట్ చేస్తానని ప్రకటిస్తే.. ఫలితాలపై కచ్చితంగా కాస్త ప్రభావం ఉంటుంది అనడంలో సందేహం లేదు.