కాకినాడ, మే 24,
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయబాబు చుట్టూ రాజకీయ దుమారం రేగుతోంది. ఇప్పటికే డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతి కేసులో ఆయనపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన వెలుగులోకి వచ్చాక అజ్ఞాతంలోకి తర్వాత పోలీసులకు లొంగిపోయారు ఎమ్మెల్సీ. ఈ అంశంపై విపక్షాల వాయిస్ పెరగడంతో రచ్చ రచ్చ అవుతోంది. దీంతో అనంతబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు సమాచారం. జిల్లాకు చెందిన వైసీపీ నేతలు.. మంత్రులుతో ఆయన టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీల ఆరోపణలకు కౌంటర్ ఇవ్వాలని కోరారట అనంతబాబు. అయితే ఎమ్మెల్సీ విన్నపానికి పార్టీ నేతలు పెద్దగా రెస్పాండ్ కాలేదట. కొందరైతే కనీసం కాంటాక్ట్‌లోకి కూడా రాలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.దారిన పోయే కంప ఒంటికి తగిలించుకోవడం ఎందుకని అనుకుంటున్నారట చాలా మంది వైసీపీ నేతలు. సున్నితమైన అంశాలలో జోక్యం చేసుకోకపోవడమే బెటర్ అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పైగా ఈ రచ్చకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. దాంతో ఎమ్మెల్సీ అనంతబాబుకు ఏం చేయాలో అంతుచిక్కడం లేదట. కష్టకాలంలోనే కదా తనకు అండగా ఉండాలని సన్నిహితుల దగ్గర మొర పెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. కాకినాడలో 20న జిల్లా పరిషత్ సమావేశం జరిగింది. ఉమ్మడి జిల్లా నుంచి ప్రజాప్రతినిధులు వచ్చారు. వారిని కలవడానికి ఒక అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్సీ కోరినా ఎవరూ ఆసక్తి చూపించలేదట.
వైసీపీ పెద్దలు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని అనంతబాబు కోరినట్టు సమాచారం. దాంతో పార్టీ పెద్దలకు అన్ని విషయాలు తెలుసని.. సరైన సమయంలో వారు స్పందిస్తారని కొందరు హితబోధ చేశారట. అయినా ఏ తప్పు చేయనప్పుడు ఆందోళన ఎందుకని వ్యంగ్యాస్త్రాలు సంధించారట. మరి అంత ర్యాష్‌గా ప్రవర్తించడం అవసరమా అని ఎమ్మెల్సీకి చెప్పిన వాళ్లూ ఉన్నారట. శుక్రవారం సాయంత్రం ప్రెస్‌మీట్ పెడతానని అనంతబాబు ముందుగా ప్రకటించారు. ఇంతలో వైసీపీ పెద్దల నుంచి అక్షింతలు పడ్డాయని ప్రచారం జరుగుతోంది. చేసిన నిర్వాకం చాలు.. కంట్రోల్‌లో ఉండాలని అన్నారట. ప్రెస్‌మీట్ పెట్టి లేనిపోని తలనొప్పులు తేవొద్దని గట్టిగానే హెచ్చరించారట. మరీ డైరెక్ట్‌గా సీన్‌లో ఇన్వాల్వ్ కావడంతో అంతా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోందిమొత్తానికి డ్రైవర్ సుబ్రమణ్యం అనుమానాస్పద మృతి కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు ఒంటరి అయ్యారు. లేనిపోని ఇబ్బందులు తెచ్చి పెట్టుకోవడం ఎందుకని దూరం జరుగుతున్నారట. పార్టీ పెద్దలు సీరియస్‌గా తీసుకోవడం వల్లే అటు వైపు కన్నెత్తి చూడడం లేదని చెబుతున్నారు. మరి.. ఈ సమస్య ఎలాంటి మలుపు తిరుగుతుందో.. ఎమ్మెల్సీ ఏం చేస్తారో చూడాలి.