అమలాపురం, మే 24,
వర్గాలు, కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవడమే జగన్ సర్కార్ ధ్యేయంగా కనిపిస్తున్నది. జగన్ సర్కార్ విధానాలతో ప్రశాంతతకు మారు పేరైన కోససీమ ఇప్పుడు ఆందోళనలతో రగులుతోంది. జగన్ సర్కార్ ఓట్ల వేటలో కోనసీమ జిల్లాలో చిచ్చు రగిల్చింది. అసలు జగన్ సర్కార్ తన విధానాలతో రాష్ట్రంలో ప్రశాంతతకు తావు లేకుండా చేసింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అశాంతి, ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికి పోతోంది.ప్రశాంతతకు మారుపేరైన కోససీమ కూడా ఇప్పడు ఆందోళనల సెగతో వేడెక్కింది. ఇందుకు కారణం జగన్ సర్కార్ తప్పిదమే. కొత్త జిల్లాల ఏర్పాటు, వాటికి పేర్ల విషయంలో ఎలాంటి కసరత్తూ లేకుండా తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు కోనసీమలో అనవసర చిచ్చుకు, రచ్చకు కారణమైంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటించిన సమయంలోనే పలు దళిత సంఘాలు కోనసీమకు డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ పేరు పెట్టాలని కోరాయి. అప్పడు వాటి వినతిని పెడచెవిన పెట్టి కోనసీమ జిల్లాగా నామకరణం చేసింది.ఆ తరువాత ఎన్నికల ప్రయోజనాలు గుర్తుకు వచ్చాయో మరో కారణమో కానీ, హఠాత్తుగా కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చింది. ఆ మార్పే ఇప్పుడు కోససీమలో ఆందోళనలు రగలడానికి కారణమైంది. మొదటే జిల్లా పేరును బీఆర్ అంబేడ్కర్ కోనసీమ అని పేరు పెట్టి ఉంటే ఎలాంటి ఆందోళనలూ జరిగేవి కావని, కోనసీమలో ఎవరూ అంబేడ్కర్ కు వ్యతిరేకం కారనీ, కానీ కేవలం ఓట్లు, ఎన్నికల ప్రయోజనాల కోసమే ఇలా పేరు మార్చడంపైనే వ్యతిరేకత పెల్లుబుకుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు పేరు మార్పునకు వ్యతిరేకంగా కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు జోరందుకున్నాయి.జిల్లా పేరు మార్పు నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రశాంతంగా, పచ్చగా ఉండే కోనసీమ ఇప్పుడు ఆందోళనలతో ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు జిల్లా వ్యాప్తంగా 144వ సెక్షన్ విధించారు. ఈ నిషేధాజ్ణలు వారం పాటు కొనసాగనున్నాయి. శాంతిభద్రతలను అదుపులో ఉంచడం కోసం 450 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.