వారాంతంలో మార్కెట్లు భారీగా నష్టపోయాయి. కర్ణాటక అసెంబ్లీ బలపరీక్షను శనివారానికల్లా పూర్తిచేయమని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు డీలాపడ్డాయి. మిడ్‌సెషన్ నుంచీ అమ్మకాలు ఊపందుకోవడంతో సెన్సెక్స్ 35,000 పాయింట్ల స్థాయి నుంచి కిందకు దిగజారింది. మార్కెట్లు ముగిసే సరికి 301 పాయింట్లు క్షీణించి 34,848 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 86 పాయింట్లు దిగజారి 10,596 వద్ద స్థిరపడింది. అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ 3.12 శాతానికి జంప్‌చేయడం, డాలరు 93.48కు బలపడటం వంటి అంశాలు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలను ఇవ్వడంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు లోనైనట్లు నిపుణులు పేర్కొన్నారు. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో కేవలం 7 కంపెనీలు మాత్రమే లాభపడ్డాయి. సెన్సెక్స్ 30ల్లో హెచ్‌యూఎల్(2.22%), కొటక్ బ్యాంక్(1.99%), ఇండస్ ఇండ్ బ్యాంక్(1.23%), ఐటీసీ(1.13%), హీరో మోటోకార్ప్(0.31%), టీసీఎస్(0.28%), యెస్ బ్యాంక్(0.04%) మొదలైనవి ఈ రోజు లాభాల్లో పయనించాయి. మరో వైపు విప్రో(3.30%), ఐసీఐసీఐ బ్యాంక్(3.21%), సన్ ఫార్మా(3.21%), ఎల్ అండ్ టీ(3.18%), టాటా మోటార్స్(3.14%), టాటా స్టీల్(3.04%) అత్యధికంగా నష్టపోయాయి.