విజయవాడ, మే 24,
రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ప్రస్తుతం ఉపయోగిస్తున్న బయోమెట్రిక్ విధానం స్థానంలో ‘ఫేషియల్ అథంటికేషన్’ (ముఖం స్కానింగ్) అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టేందుకు జగన్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీని వల్ల వృద్ధులకు మేలు చేకూరనుంది. భవిష్యత్‌లో వేలిముద్రల ఆధారంగా కాకుండా ముఖం ఆధారంగా లబ్ధిదారులను గుర్తించనున్నారు.ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం అమలు చేస్తున్నా.. ముందుగా లబ్ధిదారుల నుంచి వేలిముద్రలను సేకరించి, వాటిని లబ్ధిదారుడి ఆధార్ నమోదు సమయం నాటి వేలిముద్రలతో పోల్చి ధ్రువీకరించుకుంటారు. అయితే, లబ్ధిదారుల వేలిముద్రలు సరిపోక సమస్యలు తలెత్తున్నాయి. వృద్ధులు, ఎక్కువ కాయకష్టం పనులు చేసేవాళ్ల వేలిముద్రలు అరిగిపోతుండడంతో బయోమెట్రిక్ సమయంలో సమస్యలొస్తున్నాయి.ఫేషియల్ ఆథంటికేషన్ విధానం అమలులోకి వస్తే వేలిముద్రలకు బదులు లబ్ధిదారుని ముఖాన్ని, అతడి ఆధార్‌లోని ముఖకవళికలతో పోల్చి ధ్రువీకరించుకుంటారు. బయోమెట్రిక్‌కు బదులు ఐరిష్ విధానం అమలుచేసినా.. కళ్లలో శుక్లం ఆపరేషన్ చేసుకున్న వారితో సమస్యలు ఏర్పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.ఇక, సంక్షేమ పథకాల కోసం ప్రస్తుతం మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 లక్షల బయోమెట్రిక్ పరికరాలను ప్రభుత్వ యంత్రాంగం వినియోగిస్తోంది. అవి సున్నితమైనవి కావడంతో.. ఏటా 30 వేల నుంచి 40 వేల పరికరాలు కొత్తవి కొనుగోలు చేయాల్సి వస్తోంది. అదే ఫేషియల్ అథంటికేషన్ విధానంలో అదనంగా ఎలాంటి పరికరాలు ఉపయోగించాల్సిన అవసరం ఉండదని అధికారులు భావిస్తున్నారు. మొబైల్ యాప్ ద్వారా లబ్ధిదారుడి ముఖాన్ని స్కాన్ చేసి, దాన్ని ఆధార్‌కు అనుసంధానమైన లబ్ధిదారుడి సమాచారంతో సరిపోల్చుకుంటుందని చెబుతున్నారు.బయోమెట్రిక్ స్థానంలో ఫేషియల్ అథంటికేషన్ అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో పాటు ఆధార్ డేటా మొత్తం అనుసంధానమై ఉండే యూఏడీ విభాగం అనుమతి తప్పనిసరి. దీనికి కేంద్రం దీనికి అనుమతి ఇస్తే, దేశంలో ఫేషియల్ అథంటికేషన్ విధానం అమలు చేసే తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కానుంది.కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫరేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, యూఏడీ.. ఈ ఫేషియల్ అథంటికేషన్ విధానాన్ని రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అమలుకు అనుమతి తెలపడంతో.. విజయవాడలోని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రధాన కార్యాలయంలో మొదటగా అమలు చేస్తున్నారు. ఉద్యోగుల హాజరును 5 రోజులుగా ఫేషియల్ అథంటికేషన్ విధానంలో అమలుచేస్తున్నారు. మొదట ఐదుగురు ఉద్యోగుల హాజరును పరిశీలిస్తున్నారు. తర్వాత కార్యాలయంలోని మొత్తం 150 మంది సిబ్బంది హాజరును పరిశీలించాక.. మంత్రిత్వ శాఖ, యూఏడీ విభాగం తుది ఆమోదం కోసం నివేదిక సమర్పిస్తారు. ఆ తర్వాత అన్ని సంక్షేమ పథకాల అమలులో ఈ విధానం ప్రవేశపెట్టేందుకు వీలు ఏర్పడుతుందని అధికారులు తెలిపారు