ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో దుబాయ్‌లోని ఒక హోటల్‌లో మరణించిన నటి శ్రీదేవి కేసుపై ఢిల్లీ మాజీ పోలిస్ అసిస్టెంట్ కమిషనర్ ఒకరు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. శ్రీదేవిది సహజ మరణం కాకపోవచ్చు అని అంటున్నాడీయన. పోలిస్ ఉద్యోగం నుంచి రిటైరైన అనంతరం ప్రైవేట్ ఇన్వస్టిగేటివ్ ఏజెన్సీని నడిపించే వేద్ భూషణ్.. శ్రీదేవి మరణంపై తను పరిశోధించినట్టుగా చెబుతున్నాడు. ఇందు కోసం ప్రత్యేకంగా దుబాయ్ వెళ్లి వచ్చానని, శ్రీదేవి చివరగా బస చేసిన హోటల్‌లోనే తను కూడా బస చేశానని, ఆమె రూమ్‌ను పోలిన మరో రూమ్‌ను తీసుకుని అక్కడ ఆమె మరణించిన పరిస్థితుల గురించి పరిశోధించానని చెబుతున్నాడు. శ్రీదేవి మరణించిన తీరును చూస్తే ఆమెది సహజమరణం కాకపోవచ్చని తన పరిశోధనలో తేలిందని వేద్ చెబుతున్నాడు. ఒక మనిషిని బాత్‌టబ్‌లో ముంచి, ఊపిరి ఆడనీయకుండా చేసి హతమార్చడం కష్టం కాదు అని ఈయన అంటున్నాడు. శ్రీదేవి విషయంలో కూడా అదే జరిగి ఉండవచ్చునని, పక్కా ప్రణాళికతో ఆమెను ఎవరైనా హత్య చేసి ఉండే అవకాశముందని అంటున్నాడు. సాక్ష్యాధారాలు దొరకకుండా వారు తెలివిగా హత్య చేశారని చెబుతున్నాడు. అయితే ఆమెను ఎవరు హత్య చేసి ఉంటారు? ఎందుకు హత్య చేసి ఉంటారనే అంశాలపై ఈయన స్పందించడం లేదు. ఆమెది అనుమానాస్పద మరణం, హత్య అయి ఉండవచ్చు అని ఈయన వాదిస్తున్నారు. శ్రీదేవిది యాక్సిడెంటల్ డెత్ అని దుబాయ్ పోలిసులు నిర్ధారించిన సంగతి తెలిసిందే. అప్పటికే కొంచెం మద్యం మత్తులో ఉన్న శ్రీదేవి స్నానం చేస్తూ బాత్‌టబ్‌లో మునిగి చనిపోయి ఉంటారని అక్కడి పోలీసులు నిర్ధారించారు. ఆ నిర్ధారణ అనంతరమే శ్రీదేవి శవాన్ని ఇండియాకు పంపించడానికి అక్కడ అనుమతులు లభించాయి. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు ఈ భారతీయ మాజీ పోలిస్ చేస్తున్న వ్యాఖ్యలు మళ్లీ శ్రీదేవి మరణాన్ని మళ్లీ చర్చలోకి తీసుకొస్తున్నాయి.