న్యూ ఢిల్లీ మే 24
కాంగ్రెస్ పార్టీలో చేరడం కుదరదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చెప్పిన కొన్ని రోజులకు కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. పీకే ప్రధాన అనుచరుడు, వ్యూహకర్త సునీల్ కనుగోలుకు కీలక బాధ్యతలను అప్పజెప్పింది. సునీల్ కనుగోలుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ను ఛరిష్మాటిక్ నేతగా ప్రొజెక్ట్ చేసే బాధ్యతలు అప్పజెబుతారని, ఎన్నికల వ్యూహానికి సంబంధించిన బాధ్యతలు కూడా కట్టబెడతారన్న ప్రచారం చాలా రోజులుగా జరుగుతున్నదే. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కాంగ్రెస్ టాస్క్‌ఫోర్స్ -2024 టీమ్‌ను ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక ఉన్న ఈ టీమ్‌లో సునీల్ కనుగోలుకు చోటు దక్కింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియా ప్రకటించారు. సునీల్ కనుగోలుతో పాటు ప్రియాంక గాంధీ, ముకుల్ వాస్నిక్, చిదంబరం, జైరాం రమేశ్, అజయ్ మాకెన్, కేసీ వేణుగోపాల్, రణదీప్ సూర్జేవాలాకు సోనియా చోటు కల్పించారు. రాబోయే ఎన్నికల్లో ఈ టాస్క్‌ఫోర్స్ కమిటీ కీలక పాత్ర నిర్వహించనుంది. ఈ కమిటీలోని సభ్యులందరికీ ఒక్కో పనిని అప్పజెప్పనున్నారు. సంస్థాగత వ్యవహారాలు, మీడియా వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలతో పాటు ఎన్నికల వ్యవహారాలు అప్పజెప్పనున్నారు.