కోనసీమ జిల్లా పేరు మార్పు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తోంది. కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్రరూపం దాల్చింది. అమలాపురంలో లా అండర్ ఆర్డర్ అదుపు తప్పింది. మంత్రి ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు.. ఎమ్మెల్యే ఇంటిపై అటాక్ చేశారు. అసలు ప్రశాంతమైన కోనసీమ రణక్షేత్రంగా ఎలా మారింది..? అసలేం జరిగింది..? వివాదమేంటి?ఏపీలో కొత్త జిల్లాలు వచ్చాయి. 13 జిల్లాల నవ్యాంధ్ర.. 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌గా మారింది. కొత్త జిల్లాల ప్రతిపాదనలపై మార్చి 7వ తేదీ వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించింది. మండలాలు, డివిజన్ల మార్పు, కూర్పుతోపాటు పేర్లపై సుమారు 12 వేల 600 అభ్యంతరాలు వచ్చాయి. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న సర్కార్.. స్వల్ప మార్పులతో కొత్త జిల్లాలను ఖరారు చేసింది. ఈక్రమంలోనే... ఏపీలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భాగమైన అమలాపురం నియోజకవర్గం జిల్లాల పునర్ వ్యవస్ధీకరణలో కొత్త జిల్లాగా మారింది. ప్రభుత్వం దీనికి కోనసీమ జిల్లాగా నామకరణం చేసింది.జిల్లాలో అత్యధికంగా ఉన్న ఎస్సీ జనాభా మనోభావాల మేరకు కోనసీమ జిల్లాను కాస్తా అంబేద్కర్ జిల్లాగా పేరు మార్చాలన్న డిమాండ్లు వినిపించాయి. అమలాపురం కేంద్రంగా ఏర్పడిన కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలనే డిమాండ్ రోజురోజుకు పెరిగింది. ఇందుకోసం అంబేడ్కర్ జిల్లా సాధన సమితి నేతృత్వంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జిల్లాల విభజన ప్రక్రియ నేపథ్యంలో పలు కొత్త జిల్లాలకు దివంగత నేతల పేర్లు పెట్టడంతో.... కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లాకు సైతం అంబేద్కర్ లేదా బాలయోగి పేరు పెట్టాలనే డిమాండ్లు వినిపించాయి. కాపునేత ముద్రగడ పద్మనాభం సైతం జగన్ కు ఇదే డిమాండ్ చేశారు.తొలుత మౌనంగా ఉన్న ప్రభుత్వం.. తర్వాత.. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని కీలక నిర్ణయం తీసుకుంది. కొనసీమ జిల్లా పేరును.. డాక్టర్ అంబేడ్కర్ కొనసీమ జిల్లాగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరును కోనసీమ జిల్లాకు పెట్టడం ద్వారా ప్రభుత్వం సమంజమైన నిర్ణయమే తీసుకుందని ఎంతో మంది పార్టీలకతీతంగా అభినందించారు. కానీ... జిల్లాలో కొన్ని కులాల నేతలు, మద్దతుదారులు మాత్రం దీనిపై నిరసనలకు దిగారు. పలు చోట్ల దాడులు కూడా జరిగాయి. దీంతో పలు నియోజకవర్గాల్లో పరిస్ధితులు ఉద్రిక్తంగా మారింది. అంబేద్కర్ జిల్లా పేరును వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగారు.అంబేద్కర్ జిల్లా పేరును కోనసీమకు పెట్టడాన్ని స్వాగతిస్తూ కొందరు, వ్యతిరేకిస్తూ మరికొందరు... పోటా పోటీగా ర్యాలీలు నిర్వహిస్తుండటం, అవి కాస్తా ఉద్రిక్తతలకు వేదికవుతుండటంతో పోలీసులు కూడా దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే జిల్లాలో పలు చోట్ల ఇలాంటి వివాదాలు పెరుగుతుండటం, ఇవి దాడులకు కూడా దారితీస్తుండటంతో పోలీసులు చేసేది లేక 144 సెక్షన్ విధించారు. 144 సెక్షన్ అమల్లోకి రావడంతో పోలీసులు కూడా గట్టిగా నిఘా పెట్టారు.అమలాపురం జిల్లాకు కోనసీమ పేరునే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కోనసీమ సాధన సమితి చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్రరూపం దాల్చింది. అమలాపురం ఎస్పీ సుబ్బారెడ్డిపై ఆందోళనకారులు రాళ్లతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఎస్పీ సుబ్బారెడ్డి తలకు తీవ్రగాయాలు అయ్యాయి. ఈ దాడుల్లో 20 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. అమలాపురం డీఎస్పీ సొమ్మసిల్లిపడిపోయారు.ఆందోళనకారులు భీకరమైన విధ్వంసం సృష్టిస్తున్నారు. నిరసనకారుల దాడుల్లో ఎస్పీ సహా 20 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. 3 ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. 2 ప్రైవేటు బస్సులకు నిప్పు పెట్టారు.జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ స్థానిక మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లపైనా దాడులు చేశారు ఆందోళనకారులు. మొదట మంత్రి విశ్వరూప్ ఇంటిపై అటాక్ చేసిన నిరసనకారులు.. ఆయన ఇంటికి నిప్పు పెట్టారు. దాంతో ఆయన ఇల్లు మొత్తం అగ్నికి ఆహుతైంది. ఆ తరువాత ఎమ్మెల్యే సతీష్ ఇంటిపై అటాక్ చేసిన ఆందోళనకారులు.. ఆయన ఇంటికి కూడా నిప్పు అంటించారు. ఎమ్మెల్యే ఇంటి పర్నీచర్‌ను ధ్వంసం చేశారు. పరిస్థితి ఎంతకీ కంట్రోల్‌లోకి రాకపోవడంతో పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి హెచ్చరిక కింద ఉన్నపళంగా ఆందోళనలు విరమించాలని ఆందోళనకారులను ఆదేశించారు. లేదంటే కాల్పులు జరపాల్సి వస్తుందంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు గాల్లోకి కాల్పులు జరిపారు పోలీసులు.