విశాఖపట్టణం, మే 26,
తెలుగుదేశం గూటికి జేడీ లక్ష్మీనారాయణ చేరనున్నారు, ఆయన విశాఖ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా వచ్చే ఎన్నికలలో నిలబడనున్నారు. ఇప్పడు ఇదే రాజకీయ వర్గాలలో హాట్ హాట్ గా నడుస్తున్న టాపిక్. గత ఎన్నికలలో జనసేన అభ్యర్థిగా విశాఖ ఎంపీగా రంగంలోకి దిగిన జేడీ లక్ష్మీనారాయణ పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ ఆయనకు ఓట్లు భారీగానే వచ్చాయి. అంతే కాకుండా ఆ ఎన్నికలలో ఓటమి చవి చూసినప్పటికీ, జేడీ లక్ష్మీనారాయణ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఆ నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యారు. వీటన్నిటినీ గమనిస్తే ఆయన మరో సారి విశాఖ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఉద్దేశంతో ఉన్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారుఆయన సామాజిక సేవా కార్యక్రమాలు, గత ఎన్నికలలో ఓడినా కూడా నియోజకవర్గాన్ని వదలకుండా సేవా కార్యక్రమాలలో నిమగ్నం కావడంతో ప్రజల సానుభూతి కూడా ఆయన వైపే ఉందని వారు పేర్కొంటున్నారు. అంతే కాకుండా జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో ఆయన చూపిన చొరవ, సాహసంతో జనంలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అప్పట్లో ఆయనకు రాష్ట్ర ప్రజలలో ఒక హీరోకు ఉండే ఇమేజ్ ఉండేది. ఆంధ్రుల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన కోర్టులో పిల్ వేశారు.ఇదే అంశంపై పలు సమావేశాలూ నిర్వహించారు. రుషి కొండ తవ్వకాలకు వ్యతిరేకంగానూ గళం ఇలా ఆయన విశాఖ ప్రజలతో మమేకమయ్యారు. జగన్ రెడ్డి సర్కార్ పై జనంలో పెల్లుబుతున్న ఆగ్రహావేశాలు, జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీల ఉనికి ఏపీలో అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో ఏపీలో జనసేన, టీడీపీలు మాత్రమే బలంగా కనిపిస్తున్నాయి. బలమైన పార్టీ అభ్యర్థిగా జేడీ విశాఖ నుంచి రంగంలో దిగితే ఆయన గెలుపు నల్లేరు మీద బండి నడకే అన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతోంది.గత ఎన్నికలలో జనసేన అభ్యర్థిగా రంగంలోకి దిగిన జేడీ లక్ష్మీనారాయణ ఆ తరువాత ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు మళ్లీ అదే పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడే కంటే మరింత బలమైన టీడీపీ నుంచి పోటీ చేస్తే ప్రయోజనం అధికంగా ఉంటుందని జేడీ లక్ష్మీనారాయణ అనుచరులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం తరఫున అభ్యర్థిగా విశాఖ నుంచి పోటీ చేయాల్సిందిగా ఆయనై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. అందుకు జేడీ లక్ష్మీనారాయణ కూడా సుముఖంగా ఉన్నారని ఆయన అనుచరులు అంటున్నారు.