అనంతపురం, మే 26,
బాదుడే బాదుడు కార్యక్రమం పేరుతో అనంతపురం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. స్వామికార్యం.. స్వకార్యం అన్నట్టుగా గేర్ మార్చేశారు. అలజడులు.. విభేదాలతో సాగుతున్న తెలుగు తమ్ముళ్లను సెట్‌రైట్ చేయడానికి ప్రాధాన్యం ఇచ్చారు. గతంలో కూడా చంద్రబాబు జిల్లాకు వచ్చినా.. ఈ దఫా కాస్త భిన్నంగా పర్యటన సాగడం.. స్పీచ్‌లు ఉండటం చర్చగా మారింది. పార్టీ టికెట్ ఇచ్చే విషయంలో చంద్రబాబు ప్రకటన.. జిల్లాలో కొందరు నేతలకు ఉత్సాహాన్ని ఇస్తే.. మరికొందరిలో తీవ్ర నిరాశ.. నిస్పృహలు నింపాయట. దీనికితోడు జిల్లా నేతల్లో కొందరికి డైరెక్ట్‌గా.. ఇంకొందరికి ఇన్‌డైరెక్ట్‌గా గట్టిగానే క్లాస్ తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. జిల్లాలో దాదాపు 9 నియోజకవర్గాల్లో విభేదాలు కనిపిస్తున్నాయి. కొందరు రోడ్డెక్కి రచ్చ చేస్తున్నారు. ఇంకొందరు నేరుగా చంద్రబాబు దగ్గరకే వెళ్లి తమది మరో గ్రూప్ అని చెప్పుకొంటున్న పరిస్థితి ఉంది. టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఓడిన తర్వాత జనాల్లోకి వెళ్లని నాయకులు..పార్టీ పిలుపును కూడా పట్టించుకోలేదు. ఇలాంటి తరుణంలో చంద్రబాబు రాక.. బాదుడే బాదుడంటూ.. ప్రభుత్వాన్ని కాకుండా సొంత పార్టీ నేతలనే బాదేశారని చెవులు కొరుక్కుంటున్నారు.జిల్లాలో చంద్రబాబు ఒక్కరోజే పర్యటించినా.. కొంత సమయం పార్టీ నేతలతో మీటింగ్ కోసం కేటాయించారు. ఆ సందర్భంగా సూటిగా సుత్తిలేకుండా చెప్పేశారట. అప్పటికే జిల్లాలో టీడీపీ నేతల పరిస్థితిపై ఫీడ్ బ్యాక్ తీసుకున్న చంద్రబాబు.. కీలక నేతల ముందు చేసిన కామెంట్స్‌పై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. కొన్ని అంశాల్లో నాయకులకు గట్టిగానే తలంటారట. జిల్లాలో ఎవరేం చేస్తున్నారో తనకు తెలుసని.. ఎవరి మధ్య విభేదాలు ఉన్నాయో ఎప్పటికప్పుడు సమాచారం వస్తోందటని.. టీడీపీకి ఇబ్బందులు సృష్టిస్తున్నవారూ తమ ఫోకస్‌లో ఉన్నారని చంద్రబాబు చెప్పారట. వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్స్ ఇవ్వాలో కూడా క్లారిటీ ఉందన్నారట. తామే గొప్ప అని భావిస్తే.. గతంలో అలా గొప్పలకు పోయిన వారు కనుమరుగైన ఉదంతాలను వెల్లడించారట. వాళ్ల ముందు మీరెంత అని ఘాటైన వ్యాఖ్యలు చేశారట చంద్రబాబు.టీడీపీ కోసం కష్టపడకుండా సొంత పనులు చేసుకుంటూ.. టికెట్స్ కోసం తన చుట్టూ తిరిగితే ప్రయోజనం ఉండబోదని కొందరిని ఉద్దేశించి క్లాస్ తీసుకున్నారట చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా 40శాతం మంది యువత టికెట్లు ఇస్తామని.. కొందరు సీనియర్లు త్యాగాలు చేయాల్సి ఉంటుందని చెప్పడంతో పార్టీ నాయకులు కంగుతిన్నారట. టికెట్స్ రానివారు పార్టీ కోసం పనిచేయాలని నిర్మోహమాటంగా చెప్పడంతో మీటింగ్‌లో ఉన్నవారికి నెత్తురు చుక్క లేదట. దీంతో వచ్చే ఎన్నికల్లో నిలిచేదెవరు అనేదానిపై చర్చ మొదలైంది. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.