న్యూయార్క్, మే 26,
అమెరికాలో ఈ గన్ కల్చర్ రోజుకు 53 మందిని బలి తీసుకుంటోంది. అక్కడ జరిగే హత్యల్లో 79శాతం తుపాకులతో కాల్చి చంపినవే. చాలా ఆత్మహత్యలు తుపాకులతో చేసుకున్నావే. 2020లో 19,384 మంది కాల్పులకు బలైతే, కాల్చుకుని చనిపోయిన వారి సంఖ్య 24,292. ప్రతి సంవత్సరం ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది.. కాని తగ్గటం లేదు.2018 ఫిబ్రవరిలో నికోలస్ క్రూజ్ అనే 19 ఏళ్ల టీనేజర్ ఫ్లోరిడాలోని స్టోన్‌మన్ డగ్లస్ హైస్కూల్‌లో కాల్పులకు పాల్పడ్డాడు. AR-15 రైఫిల్‌తో అతడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 17 మంది విద్యార్థులు చనిపోయారు. ఆ ఘటన అమెరికాతో పాటు యావత్ ప్రపంచం ఉలిక్కిపడేలా చేసింది. అభం శుభం తెలియని చిన్నారులను అకారణంగా కాల్చి చంపటం అందరి మనసులను కలచివేసింది. అగ్రరాజ్యం అమెరికాలో పెచ్చరిల్లుతోన్న గన్ కల్చర్‌కు ఇది ఒక ఉదాహరణ. సరిగ్గా ఐదేళ్ల తరువాత నాటి ఫ్లోరిడా ఘటన నేడు టెక్సాస్‌లో పునరావృతమైంది.టెక్సాస్ రాష్ట్రంలోని ఉవాల్డే నగరంలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్‌లో ఈ ఘోరం జరిగింది. నాటి ఫ్లోరిడా ఘటనలో మాదిరిగానే 18 ఏళ్ల టీనేజర్ సాల్వడార్ రామోస్ AR-15 సెమీ ఆటోమేటిక్ రైఫిల్ తో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 18 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లను కాల్చి చంపాడు. అయితే దుండగుడిని కూడా అక్కడిక్కడే కాల్చి చంపారు. షూటింగ్‌కు ముందు అతడు తన బామ్మను కూడా కాల్చి చంపాడు. ఆ తరువాత వాహనంలో స్కూల్‌కు చేరుకుని ఈ ఘోరానికి తెగబడ్డాడు. ఈ ఘటన అధ్యక్షుడు జో బైడెన్‌ను కలచివేసింది. దీనిపై స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ దుర్ఘటనకు సంతాప సూచకంగా 28వ తేదీ వరకు జెండా అవనతం చేయాలని బైడెన్ కోరారు.అమెరికాలో అకారణంగా కాల్చి చంపే ఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి. అయితే టీనేజర్లు కాల్పులకు పాల్పడటం వంటి అరుదైన ఘటనలు జరిగినపుడు మాత్రమే అక్కడి సమాజం, పాలకులు తీవ్రంగా స్పందిస్తారు. తుపాకీ సంస్కృతిని తీవ్రంగా విమర్శిస్తారు. తరువాత మళ్లీ పాత కథే. నిజానికి అమెరికా సంస్కృతిలో తుపాకులు అంతర్భాగం. బ్రిటన్ వలసరాజ్యంగా ఉన్న రోజుల నుంచే అమెరికా ప్రజలు ఆత్మరక్షణకు తుపాకులు చేతపట్టారు. తుపాకుల వ్యాపారంలో బ్రిటిష్ కంపెనీలు విపరీతంగా ఆర్జించాయి. ఇక అమెరికాకు స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్లలోనే రెండో రాజ్యాంగ సవరణ ద్వారా పౌరులు తుపాకులు కలిగివుండే స్వేచ్ఛనిచ్చింది. ఇప్పుడు అమెరికాలో మూడవ వంతు వయోజనులు వ్యక్తిగత తుపాకీ కలిగివున్నారు.21 ఏళ్లు దాటి, నేర చరిత్ర లేని ఆరోగ్యవంతులైన పౌరులు తుపాకీ కలిగి వుండటం అమెరికాలో చట్టబద్దం. మైనర్లు ఫేక్ డాక్యుమెంట్స్‌తో విక్రయదారులకు అదనంగా డబ్బులు ఇచ్చి అక్రమంగా గన్ లైసెన్స్ పొందుతున్నారు. అంటే, ఆట తుపాకీలు కొనుక్కున్నంత తేలిగ్గా నిజమైన తుపాకులు దొరుకుతాయి. దాంతో బడి పిల్లలకు ఇదో అడ్వంచర్‌గా మారింది.అమెరికాలో ఈ గన్ కల్చర్‌కు ఇప్పటి వరకు కొన్ని లక్షలాది మంది బలయ్యారు. వారిలో నలుగురు దేశాధ్యక్షులు కూడా ఉన్నారు. అబ్రహం లింకన్, జేమ్స్ ఎ. గార్‌ఫీల్డ్, విలియం మెకెన్లీ, జాన్ ఎఫ్.కెనెడీ తుపాకీ తూటాలకు బలయ్యారు. రోనాల్డ్ రీగన్, ఆండ్రూ జాక్సన్, హారీ ఎస్.ట్రూమన్ పై హత్యా ప్రయత్నాలు జరిగినా ప్రాణాలతో బయటపడ్డారు. అమెరికాలో జరిగే నేరాలకు ఆయుధాలు కలిగివుండటమే ప్రధాన కారణమని 50 ఏళ్ల క్రితం అప్పటి అధ్యక్షుడు లిండన్ జాన్సన్ ప్రకటించారు. తుపాకీ సంస్కృతి ఈ భయంకర పరిణామాలకు కారణమని హెచ్చరించారు.అమెరికాలో గన్ కల్చర్‌కు చెక్ పెట్టాలని ప్రభుత్వాలు భావించినా ఆయుధ వ్యాపారాలు అడ్డుకుంటారు. ముఖ్యంగా నేషనల్ రైఫిల్ అసోసియేషన్ -NRA ఈ విషయంలో ముందుంటుంది. ప్రభుత్వం ఎప్పుడు తుపాకుల నియంత్రణకు ప్రయత్నించినా ఇది లాబీయింగ్‌తో అడ్డుకుంటూ వస్తోంది. ఇటీవల బైడెన్ తీసుకువచ్చిన ఘోస్ట్ చట్టం పరిస్థితి కూడా అదే. అమెరికాలో 63 వేల మంది ప్రభుత్వ అనుమతి పొందిన ఆయుధ వ్యాపారులున్నారు. వీరు ఏటా దాదాపు లక్ష కోట్ల కోట్ల రూపాయల విలువైన తుపాకులు అమ్ముతున్నారు. దీనికి తోడు చట్ట విరుద్ధంగా మరో పదివేల కోట్ల అక్రమ వ్యాపారం జరుగుతుంది. కనుక, అంత ఆదాయం ఉన్న ఈ వ్యాపారాన్ని ఎవరు మాత్రం వదులుకుంటారు. అందుకే అమెరికాలో గన్ కల్చర్ మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది.