కావాల్సినంత మెజార్టీ లేకున్నా, సింగిల్ లార్జెస్ట్ పార్టీ అంటూ యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు కర్ణాటక గవర్నర్ ఆహ్వానించడం...దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో, వివిధ రాష్ట్రాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీలుగా ఉన్న పార్టీలు... తమను కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని డిమాండ్ చేస్తున్నాయి. బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ నేడు గవర్నర్ సత్యపాల్ మాలిక్ ను కలిశారు. బీహార్ లో ఆర్జేడీనే అతి పెద్ద పార్టీ అయినందున, తమను ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని ఆయన వినతి పత్రం అందించారు.అనంతరం తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, గవర్నర్ కు తమ మెజార్టీ చూపించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం తమకు ఉందని, చాలా పార్టీల మద్దతు తమకు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ ను కోరామని చెప్పారు.