విజయవాడ, మే 27,
మాట ఇవ్వడం.. మాట తప్పడం జగన్ సర్కార్ కు ఈ మూడేళ్లలో ఒక అలవాటుగా మారిపోయింది. తాజగా మాట తప్పిన జాబితాలోకి సీపీఎస్ రద్దు వచ్చి చేరింది. సీపీఎస్ రద్దు చేస్తామని గత ఎన్నికలకు ముందు జగన్ హామీ ఇచ్చేశారు. జగన్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ హీమీని నమ్మిన ఉద్యోగులూ ఒక కారణమే. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచీ ఈ హామీ నుంచి వెనక్కు మళ్లడంపైనే దృష్టి పెట్టారని చెప్పాలి. పీఆర్సీ కోసం ఉద్యోగులు ఉద్యమించిన సందర్భంగా సీపీఎస్ రద్దు అంశాన్ని కూడా వారి డిమాండ్ల జాబితాలో చేర్చారు. అప్పటి నుంచి ప్రభుత్వం ఈ విషయాన్ని నీరుగార్చడం ఎలా అన్నదానిపై చాతనైనన్ని కసరత్తులు చేసింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల చేత జగన్ అనుభవ రాహిత్యంతో ఈ హామీ ఇచ్చారని కూడా చెప్పించింది. అయితే సీపీఎస్ రద్దు సాధ్యమేననీ, దాని వల్ల ప్రభుత్వంపై ఎటువంటి అదనపు భారం పడదనీ సీపీఎస్ ఉద్యోగులు హేతుబద్ధంగా లెక్కలతో సహా వివరించడంతో అప్పటికి మిన్నకున్న జగన్ సర్కార్ తాజాగా సీపీఎస్ రద్దు సాధ్యం కాదని తేల్చేసింది. అధికారంలోకి వచ్చిన వారం రోజులలోగా సీపీఎస్ రద్దు చేస్తామన్న జగన్ మాట తప్పి మడమ తిప్పడమే కాదు ఏకంగా యూటర్న్ తీసుకున్నారు. సీపీఎస్ ఉద్యోగ సంఘాలతో తాజాగా జరిపిన చర్చలలో పాత పింఛన్ విధానం అమలు సాధ్యం కాదని మంత్రుల కమిటీ కుండ బద్దలు కొట్టేసింది.అంతే కాకుండా గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని మరచిపోయి.. సీపీఎస్ విధానం అమలుకు సహకరించాలని కోరింది. అలాగే స్టాక్ మార్కెట్ లో పెట్టిన సొమ్ములు వెనక్కు వచ్చే పరిస్థితి లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల ఉద్యోగులకు చావు కబురు చల్లగా చెప్పేశారు. అయితే ఉద్యోగులు ఇందుకు ససేమిరా అన్నారు. ప్రభుత్వం అత్త సొమ్ము అల్లుడు ధారపోసినట్లు వ్యవహరిస్తోందని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం స్టాక్ మార్కెట్లో పెట్టిన సొమ్ము ప్రభుత్వ సొమ్మేం కాదని, అది ఉద్యోగుల కష్టార్జితమనీ తేల్చి చెప్పారు. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలకు తామెందుకు నష్టపోవాలని నిలదీశారు. ప్రభుత్వ చిత్తశుద్ధి లేమి కారణంగానే సీపీఎస్ రద్దుకు తిలోదకాలిచ్చేసిందని రాజకీయ వర్గాలు సైతం విశ్లేషిస్తున్నాయి. సీపీఎస్ రద్దు చేసి చూపిన రాష్ట్రాలను చూపిస్తూ, ఆ రాష్ట్రాలు చేయగలిగినప్పుడు ఏపీ ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులను దగా చేయడమే జగన్ సర్కార్ లక్ష్యంగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.