YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మంత్రి గారు డబ్బా కొట్టి మరీ సెల్ఫ్

మంత్రి గారు డబ్బా కొట్టి మరీ సెల్ఫ్

కాకినాడ, మే 27,
సీదిరి అప్పలరాజు. కాకినాడ జిల్లా ఇంఛార్జి మంత్రి. ఇంఛార్జ్‌ మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టాక.. జిల్లా సమావేశాలలో ఆయన తీరు ప్రశ్నగా మారింది. అధికారులను ఇరుకున పెడదామని ఆయన చేస్తున్న ప్రయత్నాలు చర్చగా మారుతున్నాయి. తాను స్పెషల్‌గా కనిపించాలనో ఏమో ప్రతి చిన్న విషయానికీ గంటల తరబడి సుదీర్ఘ ప్రసంగాలు చేస్తున్నారట. ఎవరైనా అధికారులు మంత్రి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పబోతుంటే.. ఐ నో ఎవ్రీథింగ్‌.. ప్లీజ్‌ సిట్‌ డౌన్‌.. అని ఇంగ్లీష్‌లో ఏకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నట్టు చెవులు కొరుక్కుంటున్నారు. జవాబు చెప్పేందుకు కుర్చీలో నుంచి పైకిలేచిన ఆఫీసర్లు చిన్న బుచ్చుకుంటున్నారట. అడగడం ఎందుకు.. చెప్పేవరకు ఆగకుండా ఈ వన్‌మ్యాన్‌ షో ఏంటని బయటకొచ్చాక సెటైర్లు పేలుతున్నాయట. చివరకు అమాత్యులవారు చెప్పింది తప్పు అని తెలిశాక నాలుక కరుచుకుంటున్నారట. పైగా తన దగ్గర మిస్టేక్స్ జరగబోవని.. తాను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్‌ని అని చరిత్ర తవ్వుకు వస్తున్నారట. అక్కడితే ఆగితే బాగోదని అనుకుంటున్నారో ఏమో.. తాను గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నానని.. మీకు కుడా తెలిసే ఉంటుందని సమావేశంలో ఉన్నవారిని ఇన్వాల్వ్ చేస్తున్నారట అప్పలరాజు.కాకినాడ గురించి తనకంతా తెలుసని.. ఇక్కడే చదువుకున్నానని హితబోధ చేస్తున్నారట మంత్రి అప్పలరాజు. జిల్లాలో క్రమశిక్షణ తప్పడం వల్లే.. జూనియర్‌ను అయినా తనకు సీఎం ఇక్కడ బాధ్యతలు అప్పగించారని గొప్పలకు పోతున్నారట. అయితే ప్రతి సమావేశంలోనూ ఈ సెల్ఫ్‌డబ్బా ఏంటి మహాప్రభో అని లబోదిబో మంటున్నారట అధికారులు. జిల్లాకి చెందిన ప్రజాప్రతినిధుల్లో ఎక్కువమంది అప్పలరాజు కంటే రాజకీయాల్లో సీనియర్లే. ఒకరిద్దరు తప్ప అంతా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వాళ్లను కూడా మంత్రి లైట్ తీసుకుంటున్నారట. కొన్నిసార్లు సీనియర్లను ఏకవచనంతో పిలుస్తూ కామెడీ చేయాలని చూస్తున్నారట. దీంతో ఆ ప్రజాప్రతినిధులకు చిర్రెత్తికొస్తోందట.ఇక్కడ ఇంకో గమ్మత్తు ఉంది. జిల్లాలో ప్రజాప్రతినిధులు స్కూల్ టీచర్లయితే.. తాను డీఈవో లాంటి వాడినని.. ఎప్పుడైనా ఎవరినైనా ఏదైనా అడిగే హక్కు తనకు ఉందని తనస్థాయి గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారట మంత్రి అప్పలరాజు. దీంతో ఇంఛార్జ్‌ మంత్రులుగా గతంలో చాలామందిని చూశామని.. కానీ ఇదెక్కడి గోల అని లోలోన మథన పడుతున్నారట. ఈ విషయాన్ని పైకి చెబితే ఒక తంటా.. చెప్పకపోతే మరో తంటాలా తయారైందని తమలో తామే సర్ది చెప్పుకుంటున్నారట. అప్పలరాజు మాత్రం రొటీన్‌గా తన స్టైల్లో తాను వెళ్తూ ఎస్టాబలీష్ కావడానికి అన్ని ప్రయత్నాలు చేయడం విశేషం. కొన్నిసార్లు కిందపడ్డా తనదే పైచెయ్యి అన్నట్టుగా మంత్రి తీరు ఉంటోందట. ప్రతి విషయంలోనూ శ్రీకాకుళంజిల్లాతో పోల్చుతూ.. అక్కడ అంతా అభివృద్ధి జరిగిందంటే తాను కూడా కారణమని చెబుతున్నారట మంత్రిగారు. కాకినాడ జిల్లాలో అంతా దానిని ఫాలోకావాలని సూచిస్తున్నట్టు సమాచారం. ఇక్కడ కూడా అదే ఫార్ములా వర్కవుట్ చేస్తానని నొక్కి వక్కాణిస్తున్నారట అప్పలరాజు.మొత్తానికి అప్పలరాజు ఏదో చేయబోయి. మరేదో చెప్తూ అడ్డంగా బుక్కైపోతున్నారు. అయినప్పటికీ తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టుగా ముందుకెళ్తున్నారు అమాత్యులవారు. మరి.. ఈ విషయంలో ఇబ్బంది పడుతున్న జిల్లా ప్రజాప్రతినిధుల్లో ఎవరైనా ధైర్యం చేసి.. అప్పలరాజుకు చెబుతారో లేక పార్టీ పెద్దలతో చెప్పిస్తారో అని పార్టీ నేతలతోపాటు.. అధికారులు గట్టిగానే చెవులు కొరుక్కుంటున్నారు.

Related Posts