YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అండగా ఉంటుందనే సంకేతాలిచ్చిన బాబు

అండగా ఉంటుందనే సంకేతాలిచ్చిన బాబు

కర్నూలు, మే 27,
టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన రొటీన్‌కు భిన్నంగా సాగింది. కర్నూలు సమావేశంలో పార్టీ కేడర్‌ స్పందన, రోడ్ షోలకు లభించిన ఆదరణకు ఫుల్‌ ఖుషీ అయ్యి కీలక ప్రకటన చేశారు. డోన్‌ అభ్యర్థిగా సుబ్బారెడ్డి పేరును ప్రకటించారు. బాబు నోటి వెంట ఈ ప్రకటన రాగానే పార్టీ శ్రేణులు నివ్వెర పోయాయి. ఎన్నికలకు రెండేళ్ల ముందే అభ్యర్థిని ప్రకటించిన ఉదంతాలు లేకపోవడంతో అది చర్చగా మారింది. దీని వెనక టీడీపీ వ్యూహం ఏంటనే దానిపై ఆరా తీస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. డోన్‌లో టీడీపీ ఇంచార్జ్‌గా సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టాక కేఈ వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా కరపత్రాలు వేయడం.. నిరసనలు తెలియజేయడం కలకలం రేపింది. కేఈ కుటుంబానికి బాధ్యతలు అప్పగించాలని డిమాండ్స్‌ వినిపించాయి. ఆ ఎపిసోడ్‌లో పార్టీ అధిష్ఠానం కేఈ వర్గానికి షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. ఆ గందరగోళానికి తెరదించడానికే డోన్‌ విషయంలో చంద్రబాబు స్పష్టత ఇచ్చారని అనుకుంటున్నారట. వచ్చే ఎన్నికల్లో డోన్‌లో కేఈ కుటుంబం పోటీ చేస్తుందని కొందరు.. కోట్ల కుటుంబం నుంచి బరిలో ఉంటారని మరికొందరు రకరకాలుగా ప్రచారంచేశారు. చర్చలు పెట్టారు. అలాంటి వాటన్నింటికీ సుబ్బారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి చెక్‌ పెట్టారని భావిస్తున్నారు.డోన్‌ అభ్యర్థిత్వంపై క్లారిటీ ఇవ్వడం ద్వారా పార్టీ నేతలు చంద్రబాబు మరో మెసేజ్‌ పంపారని భావిస్తున్నారు. అభ్యర్థుల ప్రకటనలో ఒత్తిళ్లకు తలొగ్గబోమని, పనిచేసే వారికి ప్రాధాన్యం ఉంటుందని చెప్పడం కూడా అందులో భాగమని టీడీపీలో చర్చ జరుగుతోందట. సుబ్బారెడ్డి జైలుకు వెళ్లి వచ్చారని.. పార్టీ కోసం గట్టిగా పోరాడుతున్నారని చంద్రబాబు వేదికపైనే చెప్పారు. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పేరును కూడా ప్రస్తావిస్తూ పార్టీ కోసం వెనక్కి తగ్గడం లేదని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన భయపడలేదని తెలిపారు. ఈ రెండు ఉదాహరణల ద్వారా కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉన్నవారిని అక్కున చేర్చుకుంటామని చెప్పకనే చెప్పేశారు. పైగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సొంత ఊరు బేతంచెర్ల మున్సిపల్ ఎన్నికల్లో 6 వార్డులను టీడీపీ దక్కించుకోవడం వెనక సుబ్బారెడ్డి పాత్రను గుర్తించారు. అందుకే డోన్‌ అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించారని విశ్లేషిస్తున్నారట.డోన్ టీడీపీ అభ్యర్థిని ప్రకటించారు కానీ.. ఇకపై నియోజకవర్గంలో పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తి కలిగిస్తోంది. డోన్‌లో బాగా పట్టున్న కేఈ వర్గం సుబ్బారెడ్డికి సహకరిస్తుందా.. లేక అసంతృప్తిని కొనసాగిస్తుందా అనేది అంతుచిక్కడం లేదట. అలాగే కోట్ల కుటుంబానికి కూడా నియోజకవర్గంలో పట్టుంది. ఈ రెండు కుటుంబాల తీరు వచ్చే ఎన్నికల నాటికి ఎలా ఉంటుందో ఊహించడం కష్టమంటున్నాయి రాజకీయ వర్గాలు. మరి.. డోన్‌లో చంద్రబాబు ఎత్తుగడ వర్కవుట్‌ అవుతుందో లేదో చూడాలి.

Related Posts