ఒంగోలు, మే 27,
తుపాన్లు, వరదలకు పంటలు దెబ్బతినకుండా ఉండేందుకు ఈ ఏడాది వ్యవసాయ సీజన్‌ను ముందుగానే ప్రారంభించేందుకు సిద్ధమైన ప్రభుత్వం, అత్యంత ముఖ్యమైన సాగునీటి కాలువల మరమ్మతులను విస్మరించింది. ఖరీఫ్ సాగుకు జూన్ ఒకటో తేదీ నుంచే కాలువలకు నీటిని విడుదల చేయాలని ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాలు, సోమశిల, రాయలసీమ తదితర ప్రాంతాల్లో కాలువలకు నీటి విడుదల షెడ్యూల్‌ను కూడా ఖరారు చేసింది. అదే సమయంలో, వేసవిలో చేపట్టాల్సిన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఒఅండ్‌ఎం) పనులను ప్రభుత్వం అంతగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండేళ్లుగా కోవిడ్ వల్ల ఎక్కడా పనులు జరగలేదు. అంతకముందు రెండు, మూడేళ్లు కాలువల్లో పూడికతీత పనులతోపాటు తూటుకాడ, గుర్రపుడెక్క తొలగింపు, రెగ్యులేటర్ల మరమ్మతులను ప్రభుత్వం చేపట్టలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయకట్టు అభివృద్ధి సంస్థ (కాడా) సమావేశమై రూ.149.14 కోట్లతో 997 ఒఅండ్‌ఎం పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఈ పనుల నిర్వహణకు టెండర్లు పిలవాలా? లేక నామినేషన్లపై కేటాయించాలా? అనేది ఇంకా నిర్ధారణ అవ్వలేదు. ఒఅండ్‌ఎం పనులను పూర్తి చేసేందుకు కనీసం నెల రోజులపైనే సమయం అవసరం ఉంటుందని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా కాలువలకు నీటిని విడుదల చేస్తే, అవి ఆయకట్టు చివరి భూములకు చేరడం కష్టమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ తొలుత కృష్ణా, గోదావరి డెల్టాలలోనే ప్రారంభమవుతుంది. గోదావరి డెల్టాకు జూన్ ఒకటిన, కృష్ణా డెల్టాకు జూన్ 10న నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో ఒఅండ్‌ఎం పనులు చేపట్టేందుకు సమయం ఉన్నప్పటికీ, కృష్ణా, గోదావరి డెల్టాల్లో పనులు చేపట్టేందుకు ఏమాత్రం గడువు సరిపోదు. ఈ నేపథ్యంలో కాలువలు, హెడ్ రెగ్యులేటర్స్, రెగ్యులేటర్లు, షట్టర్లకు మరమ్మతులు చేపట్టకుండానే నీటిని విడుదల చేస్తే, చివరి భూములకు నీరు చేరడం ఆలస్యమవుతుందని అధికారులు చెబు తున్నారు. గోదావరి డెల్టా కింద 10.38 లక్షల ఎకరాలు, కృష్ణా డెల్టా కింద 13.08 ఎకరాల ఆయకట్టు ఉంది.రాష్ట్రంలో డెల్టాల ఆధునికీకరణ పనులు పూర్తికాకపోవడంతో కాలువలు చాలా వరకు పూడుకుపోయాయి. కాలువ కట్టలు కూడా బలహీనంగానే ఉన్నాయి. ఐదారేళ్లుగా డెల్టాల ఆధునికీకరణ పనులను ఏ ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదు. దీంతో ఆయకట్టు చివరి భూములకు ఏటా సాగునీటి సమస్యలు తప్పడం లేదు. ఈ ఏడాది వేసవి ఆరంభంలోనే కాలువలకు మరమ్మతు పనులు చేపట్టినట్లయితే జూన్‌లో నీటి విడుదలకు ఇబ్బందులు లేకుండా ఉండేదని రైతులు అభిప్రాయపడుతున్నారు. వెంటనే పనులు చేపట్టాలి