తిరుపతి, మే 27,
టమాట క్రయ, విక్రయాలకు దేశంలోనే అతి పెద్దదైన మదనపల్లె టమాట మార్కెట్‌లో ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. వారం రోజులుగా ధరలను గమనిస్తే మే 7న మొదటి రకం టమాట ధరలు కిలో రూ.24–44, 8న రూ.27–50, 9, 10న రూ.30–52, 11, 12న రూ.35–56 మధ్య ధరలు పలికితే 13వ తేదీన రూ.39–60కు చేరుకున్నాయి. శుక్రవారం మదనపల్లె మార్కెట్‌కు వివిధ ప్రాంతాల నుంచి రైతులు 198 మెట్రిక్ టన్నులు తీసుకువచ్చారు. బహిరంగ మార్కెట్లో నాణ్యతను బట్టి రూ.50–80 వరకు విక్రయిస్తున్నారు. దీంతో సాధారణ, మధ్యతరగతి ప్రజలు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెడుతున్నారు.మే నెలలో వివాహాది శుభకార్యాలు అధికంగా ఉండటం.. వాతావరణంలో అనూహ్యంగా చోటుచేసుకుంటున్న మార్పులు, పంట దిగుబడులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం మదనపల్లె నుంచి తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఒరిస్సా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. బయటి మార్కెట్లలో స్థానికంగా సరుకు రాకపోవడం, డిమాండ్ అధికంగా ఉండటంతో ఇక్కడి వ్యాపారులు అధిక ధరలకు కొనుగోలు చేసి అక్కడికి తరలిస్తున్నారు. మే చివరి వరకు అధిక ధరలే పలుకుతాయని వ్యాపారులు చెపుతున్నారు. మార్కెట్‌లో టమాటకు లభిస్తున్న ధరలపై రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.