వాషింగ్టన్
చైనా సైనిక పరిశోధకులు భారీ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ తమ దేశ భద్రతకు స్టార్‌లింక్ శాటిలైట్లతో ప్రమాదం ఏర్పడితే, వాటిని నిర్వీర్యం చేసేందుకు కావాల్సిన టెక్నాలజీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసే పనిలో చైనా ఉన్నట్లు ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్టు దీనికి సంబంధించిన స్టడీని ప్రచురించింది. ప్రతి ఒక్క స్టార్‌లింక్ శాటిలైట్‌ను ట్రాక్ చేసి మానిటర్ చేసేందుకు కావాల్సిన నిఘా వ్యవస్థను డెవలప్ చేయాలని చైనా మిలిటరీ సైంటిస్టులు ప్రయత్నిస్తున్నట్లు ఆ కథనంలో వెల్లడించారు. రెన్ యువాన్‌జెన్ నేతృత్వంలో ఆ స్టడీ సాగినట్లు తెలుస్తోంది. స్టార్‌లింక్‌ను ఢీకొట్టేందుకు చాలా సున్నితమైన, కచ్చితమైన టెక్నాలజీని చైనా డెవలప్ చేస్తున్నట్లు కథనంలో పేర్కొన్నారు.స్టార్ లింక్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను నిర్వీర్యం చేసే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు భావిస్తున్నారు. స్టార్‌లింక్ కంపెనీ బిలియనీర్ ఎలన్ మస్క్‌కు చెందిన విషయం తెలిసిందే. స్టార్‌లింక్ ప్రస్తుతం తన వద్ద ఉన్న టెక్నాలజీతో అమెరికా డ్రోన్లు, స్టీల్త్ ఫైటర్లను దాదాపు వంద రేట్ల అధిక స్పీడ్‌తో అపరేట్ చేసే అవకాశాలు ఉన్నట్లు చైనా మిలిటరీ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. స్టార్‌లింక్ కంపెనీ వద్ద వేల సంఖ్యలో చిన్న తరహా ఉపగ్రహాలు ఉన్నాయి. అయితే వాటన్నిటినీ నాశనం చేయడం అంత సులువు కాదు. దీని కోసం కొత్త టెక్నాలజీని డెవలప్ చేయాలని చైనా భావిస్తోంది. లేజర్లు, మైక్రోవేవ్ టెక్నాలజీతో స్టార్‌లింక్‌ను దెబ్బతీయాలని చైనా ప్లాన్ వేస్తున్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్టు తన కథనంలో పేర్కొన్నది.