మైసూరు
విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు మైసూరులో దత్త పీఠాన్ని సందర్శించారు. గణపతి సచ్చిదానంద స్వామివారి 80వ జన్మదిన మహోత్సవంలో పాల్గొన్నారు. దత్తపీఠం ఉత్తరాధికారి విజయానంద తీర్థ పీఠాధిపతులకు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం గణపతి సచ్చిదానంద తమ పీఠ ప్రాంగణంలోని దేవతా మూర్తుల ఆలయాలకు తీసుకెళ్ళారు. దత్తాత్రేయ మందిరంతో పాటు పంచాయతన క్షేత్రాలను సందర్శించారు. ఆ తర్వాత గణపతి సచ్చిదానంద స్వామివారి ఆంతరంగిక మందిరంలో సమావేశమయ్యారు. పూణెలోని మహర్షి వేదవ్యాస్ ప్రతిష్టాన్ స్వామీజీ గోవింద దేవ్ గిరి కూడా ఈ సమావేశంలో పాల్గొని ఆధ్యాత్మిక అంశాలపై చర్చించారు. జన్మదిన మహోత్సవ వేదికపై స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మ వ్యాప్తికి గణపతి సచ్చిదానంద స్వామి చేస్తున్న సేవలను ప్రస్తావించారు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠాధీశులు సుబుధేంద్ర తీర్థ, శ్రౌత పండితులు చెన్నకేశవ అవధాని, సంస్కృత పండితులు విరూపాక్ష జడ్డిపాల్ తదితరులు గణపతి సచ్చిదానంద స్వామివారి జన్మదిన వేడుకల్లో విశాఖ శారదా పీఠాధిపతులతో పాటు పాల్గొన్నారు. దత్త పీఠం నిర్వహణలోని వేద పాఠశాల విద్యార్థులు విశాఖ శారదా పీఠాధిపతులను కలిసి గురువందనం సమర్పించారు.