YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పైసల కోసం పడిగాపులు

పైసల కోసం పడిగాపులు

తెలంగాణలో ధాన్యం సేకరణ జోరుగా సాగుతోంది. అయితే ధాన్యం విక్రయించగా వచ్చే సొమ్ము కోసం అన్నదాతలు పడిగాపులు పడుతున్న పరిస్థితి కరీంనగర్ జిల్లాలో కనిపిస్తోంది. నానాపాట్లు పడి అమ్ముకున్న పంటకు డబ్బులు రాక రైతులు దిగాలుపడుతున్నారు. ఆన్ లైన్ జమ చేస్తామని అధికారులు చెప్తున్నా.. తమ ఖాతాల్లో నగదు జమ కావడంలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ధాన్యం కాంటా అయిన కాసేపట్లోనే ఆన్‌లైన్‌లో వివరాల్ని పూర్తిస్థాయిలో నమోదు చేస్తున్నారు. ఆధార్‌ వివరాలతోపాటు ధాన్యం కొన్నతీరు వివరాల్ని ట్యాబ్‌ల ద్వారా ఇంటర్నెట్ లో పొందుపరుస్తున్నారు. సంచుల్ని లారీలోకి చేర్చింది మొదలు రెండురోజుల్లో డబ్బుల్ని అందించేందుకు ఓపీఎంఎస్‌ విధానాన్ని పాటిస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో వివరాల నమోదు త్వరితగతిన సాగిపోతున్నా మరికొన్ని కేంద్రాల్లో మాత్రం జాప్యం జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నమోదు చేసిన వివరాలు పౌరసరఫరాల సంస్థ రాష్ట్ర కార్యాలయానికి చేరడం అక్కడి నుంచి నిధుల విడుదల ఆధారంగా నిర్దేశిత బ్యాంకుల్లోని రైతు ఖాతాలోకి డబ్బుల్ని జమ చేస్తారు. అయితే పలు కేంద్రాల్లో జాప్యమే కాకుండాబ్యాంకులకు ఆమోదం విషయంలోనూ కొంత నిర్లక్ష్యం కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. 

 

వివరాల నమోదులో జాప్యం వల్ల తమకు డబ్బులు అందడంలేదని క్షేత్రస్థాయిలో పలువురు అన్నదాతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అటు మార్కెట్‌ కమిటీలతోపాటు కొనుగోలు కేంద్రాలకు, బ్యాంకుల వద్దకు వెళ్తూ నగదు జమ విషయమై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు అన్ని కేంద్రాల్లో ధాన్యం అధికంగా పేరుకుపోయింది. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేందుకు సిబ్బంది కొనుగోళ్లపైనే శ్రద్ధ పెట్టారని సమాచారం. దీంతో రైతుల డబ్బుల జమ విషయంలో వారు కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్షాల కారణంగా రైతులు ఇప్పటికే నానాపాట్లు పడ్డారు. అష్టకష్టాలు పడి పంటను మద్దతు ధరకు అమ్ముకోవడంపైనే దృష్టి పెట్టారు. ఇంత జరిగినా చివరకు చేతికి పైసలు సజావుగా అందడంలేదనే అపవాదును అధికారులు ఎదుర్కొంటున్నారు.  ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి అన్నదాతల ఖాతాల్లో డబ్బుల జమ చేసేందుకు చర్యలు ముమ్మరం చేయాలి. అంతేకాక కొనుగోళ్ల ప్రక్రియను వేగిరం చేయడంతోపాటు పేరుకుపోతున్న బకాయిల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తేనే సమస్య పరిష్కారమయ్యే వీలుందని రైతుసంఘాలు స్పష్టంచేస్తున్నాయి.

Related Posts