YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పనుల్లో జాప్యం..సమస్యల నిలయం..

 పనుల్లో జాప్యం..సమస్యల నిలయం..

ఇంటింటికీ తాగునీరు అందించేందుకు తెలంగాణ సర్కార్ మిషన్ భగీరథ ప్రారంభించింది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పనులు పలు జిల్లాల్లో వేగంగా సాగుతున్నాయి. అయితే సూర్యాపేటలోని పలు ప్రాంతాల్లో మాత్రం పనులు నెమ్మదిగా సాగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రధానంగా పట్టణప్రాంతాల్లో నత్తనడకన సాగుతున్నాయని స్థానికులు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. అధికారుల ఉదాసీనత, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఈ సమస్య అని అంటున్నారు. వాస్తవానికి పట్టణాల్లో పనులు మొదలై ఏడాది అవుతోంది. అయితే ప్రాజెక్ట్ పనులు మాత్రం సగానికి పైగా అసంపూర్తిగానే ఉన్నాయి. పట్టణాల్లో గతేడాది మే 22న పనులు మొదలుపెట్టారు. ఈ ఏడాది నవంబరు 21 నాటికి పూర్తి చేసేలా కాంట్రాక్టర్ సంస్థ ‘మెయిల్‌’తో ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ పనులు ఆశించినంత వేగంగా సాగడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజారోగ్యశాఖ పర్యవేక్షణలో ప్రతి మూడు నెలలకోసారి పనులను సమీక్ష చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా ఫలితం లేదని అంటున్నారు. మే చివరికి 65 శాతం పనులు పూర్తి చేయాల్సి ఉన్నా ఎక్కడా 40 శాతానికి మించి పనులు పూర్తి కాలేదని వ్యాఖ్యానిస్తున్నారు.

 

సూర్యాపేటలో కార్పోరేషన్ అధికారులు రహదారులను విస్తరించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే మిషన్‌ భగీరథ పైపులను మాత్రంరహదారి మధ్యలో వేస్తున్నారు. పనుల నిర్వహణలో ప్రజారోగ్య శాఖ, కాంట్రాక్ట్ కంపెనీ ఇంజినీర్ల మధ్య సరైన సమన్వయం లేకపోవడం సమస్యలకు తావిస్తోంది. కొన్నిచోట్ల ఆక్రమణలను తొలగించకుండానే పనులు సాగిస్తున్నారు. రోడ్లు తవ్విన ప్రాంతంలో మళ్లీ ఆ గుంతల్లో మట్టి లేదంటే సిమెంట్‌ వేయాల్సి ఉంది. అయితే అలాంటి చర్యలేవీ చేపట్టకుండా కంకరపొడి వేసి మిన్నకుంటున్నారు. రహదారులను తవ్వి గుంతలను అలాగే వదిలేయడంతో ఎత్తుపల్లాలుగా మారింది. దీంతో ఆయా రోడ్ల మీదుగా వెళ్లే వాహనదారులు, బాటసారులు నానాపాట్లు పడుతున్నారు. తరచూ ప్రమాదాలకూ గురవుతున్నారు. మరోవైపు తవ్వకాల సమయంలో పురపాలిక అధికారుల, సిబ్బంది సమన్వయం లేకపోవడంతో తాగునీటి పైపులైన్లు పగిలిపోయి నీళ్లు లీకవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ సమస్యలపై దృష్టి సారించి మిషన్ భగీరథ పనులను పర్యవేక్షించాలని అంతా కోరుతున్నారు.

Related Posts