కాకినాడ, జూన్ 4,
ఒక్క పులి.. అధికార యంత్రాంగాన్ని, సమీప గ్రామాల ప్రజల్ని కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. కాకినాడ జిల్లాలో 12 రోజులుగా పెద్ద పులి సంచారంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పులి దాడికి గేదెలు, ఆవులు, ఇతర జంతువులు గాయాల పాలవుతున్నాయి. మరికొన్ని చనిపోతూ యజమానులకు తీరని నష్టం కలిగిస్తున్నాయి. తాజాగా పొదురుపాక వద్ద ఆవుని చంపిన పులి.. గురువారం రాత్రి శరభవరం వద్ద రెండు గేదెలపై దాడి చేసింది. పులి దాడి నుంచి గేదెలు గాయాలతో తప్పించుకున్నాయి. పులి దాడులతో ఒమ్మంగి, పోతులూరు, పొదురుపాక, పాండవులపాలెం, శరభవరంలో గ్రామస్తులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.పులిని పట్టుకునేందుకు సీసీ కెమేరాలు ఏర్పాటుచేశారు అటవీ, వణ్యప్రాణి సంరక్షణ అధికారులు. పులి కదలికలపై నిఘా పెట్టడం, పాదముద్రలు సేకరించడం, సీసీ కెమెరాలు అమర్చడం వంటివి చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో బృందాలు పులిని పట్టుకునేందుకు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. పులిని బోనులో బంధించేందుకు ఆవు డెడ్ బాడీని బోనులో అమర్చారు. పోతులూరు వద్ద ఉన్న మూడు బోనుల్ని పొదురుపాక తరలించారు. మృత కళేబరాన్ని బోనుల్లో వేసి పులి అందులోకి వచ్చేలా చిక్కేలా ఆపరేషన్ చేపట్టారు.జూన్ 2న పొదురుపాక సమీపంలోని పశువుల పాకపై పులి పంజా విసిరింది. ఒక ఆవును వేటాడి సమీప తోటల్లోకి ఈడ్చుకెళ్లి, ఆవు మెడ భాగం కొంత తినేసి వెళ్లింది. వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌వో సెల్వం, జిల్లా అటవీఅధికారి ఐకేవీ రాజు, స్క్వాడ్ డీఎఫ్‌వో ఎన్వీ ప్రసాదరావు, ఏసీఎఫ్ సౌజన్య, రేంజరు వరప్రసాదరావు సిబ్బంది ఆవును వేటాడిన ప్రదేశం, పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. పోతులూరు నుంచి పొదురుపాకకు బేస్ క్యాంపు మార్చారు.ఈ పులి 180 కేజీలకు పైనే బరువు.. ఆరున్నర అడుగుల పొడవు ఉంటుందని చెబుతున్నారు. వేటాడే క్రమంలో దారి తప్ఫి. విజయనగరం జిల్లా ఎస్.కోట – అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మీదుగా వందల కిమీ ప్రయాణించి ఇటు వచ్చినట్లు గుర్తించారు. ఒమ్మంగి సమీపంలో రెండు గేదెలను వేటాడిన పులి.. ఆహార అన్వేషణకు అనుకూలతతో ఊదరేవడి మెట్టపైనే మకాం పెట్టినట్లు భావిస్తున్నారు.పులి సంచారంతో సమీప ఆరు గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రాత్రిళ్ళు బయటకు రావడానికి జంకుతున్నారు. జాతీయ జంతువు కావడంతో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మార్గదర్శకాల ప్రకారం కమిటీ ఏర్పాటుచేసి.. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాలి. కమిటీ ఏర్పాటు చేసినా.. పరిస్థితి చేయిదాటితేనే రెస్క్యూ ఆపరేషన్ వరకు వెళ్లే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు. పులి వచ్చిన దారిలోనే అడవికి వెళుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ సబ్ డీఎఫ్‌వో సౌజన్య నేతృత్వంలో డీఆర్‌వో రామకృష్ణ, సెక్షన్ ఆఫీసర్ రవిశంకర్ నాగ్, గోకవరం, అడ్డతీగల సిబ్బంది గ్రామాల్లో గస్తీ కాస్తున్నారు. పులిని ఏవిధంగానైనా బంధించేందుకు వీరంతా పనిచేస్తున్నారు. త్వరగా పులిని బంధించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.