గుంటూరు, జూన్ 4,
పార్టీ ప్లీనరీ నిర్వహించాలంటూ వైసీపీ అధినేత తీసుకున్న నిర్ణయంతో వైసీపీ నేతల్లో కలవరం మొదలైందా? అంటే అవుననే అంటున్నాయి పార్టీ శ్రేణులు. వచ్చే నెలలో వైసీపీ ప్లీనరీ ఒంగోలు మహానాడుకు మించి విజయవంతం చేయాలంటూ జగన్ హుకుం జారీ చేయడంతో వైసీపీ నేతల గుండెల్లో గుబులు మొదలైందంటున్నారు. గడప గడపకూ కార్యక్రమంలో ప్రజా నిరసన జ్వాలల మంట ఇంకా సెగ తగులుతూనే ఉన్నాయి, సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర జనంలేక వెలవెలబోయిన దృశ్యం ఇంకా కళ్ల ముందే ఉంది. ఈ పరిస్థితుల్లో పార్టీ ప్లీనరీ కోసం జన సమీకరణ సాధ్యమేనా? తమ వల్ల అవుతుందా అన్న శంక వైసీసీ నేతల్లో ప్రారంభమైందని అంటున్నారు. అందకే ప్లీనరీకి ముందు జిల్లాలలో సన్నాహక ప్లీనరీలు నిర్వహించాలని జగన్ ఆదేశించడంతో జిల్లా స్థాయి నాయకులు ఇప్పటి నుంచే మొహం చాటేస్తున్నారని పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నారు. ప్లీనరీ నిర్వహణలో నేతల ఇబ్బందులు, కష్టాల గురించి పట్టించుకోకుండా.. మీరేం చేస్తారో తెలియదు. మహానాడుకు మించి వైసీపీ ప్లీనరీ విజయవంతం కావాలి. జన సమీకరణ బారీగా జరగాలి అంటూ జగన్ ఆదేశించడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్న కాక మొన్న సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర సభలకు పథకాలు ఆపేస్తాం అంటూ బెదరించి, భయపెట్టి తీసుకు వచ్చిన జనాలను మంత్రులు వచ్చే వరకూ కూడా నిలువరించలేకపోయిన సంగతిని పరిశీలకులు గుర్తు చేస్తూ ఈ పరిస్థితుల్లో జనసమీకరణకు పార్టీ నేతలు నడుంబిగించే అవకాశాలు తక్కువేనని అంచనా వేస్తున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి సభ నుంచే జనాలు వెళ్లిపోతున్న పరిస్థితుల్లో భారీ ఎత్తున ప్లీనరీ నిర్వహించాలనీ, భారీగా జనసమీకరణ చేయాలనీ తలపెట్టడం సరికాదని వారు విశ్లేషిస్తున్నారు.ఏలూరులో జగన్ పాల్గొన్న రైతు భరోసా సభనుంచి జనాలు గుంపులు గుంపులుగా వెళ్లిపోవడం, పోలీసులు ఆపినా ఆగకపోవడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’‘సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర’ అటు ప్రజలనే కాదు, ఇటు వైసీపీ కార్యకర్తలనూ కదలించలేకపోయిన విషయాన్ని వైసీపీ నేతలు అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్లీనరీ నిర్వహణకు జన సమీకరణ అంత సులువు కాదని వారు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ప్రజలు బహిరంగంగానే ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మహానాడుకు దీటుగా వైసీపీ ప్లీనరీ నిర్వహించి సత్తా చాటాలని జగన్ నిర్ణయించి, జనసమీకరణ చేయాలంటూ నేతలకు బాధ్యత అప్పగించడంపై పార్టీలో అసంతృప్తి వ్యక్తమౌతున్నది. పార్టీ కేడర్ సైతం చేసిన పనులకు బిల్లులు రాక అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వారిని ప్లీనరీ కోసం కార్యోన్ముఖులు చేయడం అంత తేలికైన పని కాదని వైసీపీ నేతలు లోలోపల రగిలిపోతున్నారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జూలై 8 నుంచి రెండు రోజుల పాటు గుంటూరు జిల్లా నాగార్జున వర్సిటీ సమీపంలోని మైదానంలో ప్లీనరీ నిర్వహణకు జగన్ నిర్ణయించిన సంగతి విదితమే. తెలుడగుదేశం జిల్లాల్లో నిర్వహించిన మినీ మహానాడును తరహాలో నియోజకవర్గాల్లో ప్లీనరీ నిర్వహించి జనసమీకరణ చేయాలని ఆదేశించారు. కీలక నేతలకు ఈ బాధ్యతలు జగన్ అప్పగించారు. జిల్లా ఇన్ చార్జి మంత్రులకు ఆ దిశగా స్పష్టమైన ఆదేశాలిచ్చారు.అయితే ప్లీనరీకి ప్రజలను ఎలా రప్పించగలమని వైసీపీ నేతలు తలలు బాదుకుంటున్నారు. బాహాటంగా కనిపిస్తున్న ప్రజా వ్యతిరేకతను తోసిరాజని ప్లీనరీని విజయవంతం చేసుకోవడం, అదీ మహానాడును మించి చేయాలని అధినేత భావించి.. ఆ బాధ్యతను తమ తలపై మోపడం నేల విడిచి సాము చేయమనడం లాంటిదేనని వైసీపీ నేతలు లోపల్లోపల రగిలిపోతున్నారు.