YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ముందే రానున్న వానలు

ముందే రానున్న వానలు

రైతులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. నైరుతి రుతు పవనాలు మే 29 నాటికి కేరళ తీరాన్ని తాకుతాయని ప్రకటించింది. జూన్ మొదటి వారంలో రాష్ట్రానికి చేరుకుంటాయని వెల్లడించింది. సహజంగా జూన్ మొదటి వారంలో కేరళ తీరాన్ని తాకే నైరుతి రుతు పవనాలు ఈసారి కొంచెం ముందుగానే వస్తున్నాయి. ఈ ఏడాది కూడా సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. జులై మధ్య నాటికి దేశమంతా వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. రుతుపవనాలు దేశంలో ప్రవేశించిన తర్వాత మొదటి 15 రోజుల్లోనే దేశంలో సగం ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మూడ్రోజుల ముందే.. అంటే మే 29వ తేదీనే కేరళ తీరాన్ని తాకుతాయని వెల్లడించింది. మే 23వ తేదీలోపే రుతుపవనాలు అండమాన్ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతాన్ని తాకేందుకు పూర్తి అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ విభాగం  తెలిపింది. భారతదేశపు 136 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థకు జీవగర్రగా నిలిచే నైరుతి రుతుపవనాలు కేరళలోకి సాధారణంగా జూన్ ఒకటిన ప్రవేశిస్తాయి. ఈసారి నాలుగు రోజులు అటూ ఇటూగా మే 29న కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండీ పేర్కొంది. వాతావరణశాఖ వెలువరించిన తొలి అంచనాల ప్రకారం ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదుకానుంది. సాధారణ వర్షపాతం నమోదవుతుందని గత మూడేండ్లుగా ఐఎండీ అంచనావేస్తూ వస్తున్నది.  జూన్-సెప్టెంబర్ మధ్య 96%-104% వర్షపాతం కురిస్తే అది సాధారణంగా పరిగణిస్తారు. భారతదేశంలో 70% వర్షాలు ఈ కాలంలోనే పడుతాయి. వ్యవసాయ పనులు ప్రారంభంతోపాటు, వేసవి నుంచి ఊరట పొందటానికి రుతుపవనాల ఆగమనంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంటుంది. దాదాపు సగానికిపై భారతీయ వ్యవసాయం వర్షాధారితమైన నేపథ్యంలో రైతుకు రుతుపవనాలే దిక్కు. అందుకే వానకాలం పంటే దేశంలో అత్యధికంగా ఉంటుంది. రుతుపవనాల ఆగమనంపై ఐఎండీ 2005 నుంచి ప్రకటనలు చేస్తున్నది. 2017 వరకు చూస్తే ఈ పదమూడేండ్లకాలంలో 2015లో మినహా అన్ని సందర్భాల్లో ఐఎండీ అంచనాలు నిజమయ్యాయి. ఇదిలాఉంటే.. ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్.. ఈ సారి రెండు రోజులు అటూఇటూగా మే 28న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని పేర్కొంది. 

Related Posts