కాకినాడ
కాకినాడ జిల్లాలో శనివారం రెండు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. సామర్లకోట-పెద్దాపురం ఏడీబీ రోడ్డులో అపర్ణా సిరామిక్ సమీపాన యూ టర్న్ తిరుగుతున్న లారీని వెనుక నుంచి మరో లారీ అతి వేగంగా ఢీకొన్న ప్రమాద సంఘటనలో లారీ డ్రైవర్ ఎండీ అబ్రహం (35) కాబిన్ లోనే చిక్కుకుని కాళ్ళు నుజ్జు నుజ్జు అయ్యి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం లో మృతుడు లారీ డ్రైవర్ అబ్రహం కృష్ణా జిల్లా గుడివాడ కు చెందిన వ్యక్తిగా పెద్దాపురం పోలీసులు గుర్తించారు. కాకినాడ నుంచి ఏడీబీ రోడ్డులో అపర్ణా సిరామిక్ సంస్థకు వెళుతున్న లారీని కాకినాడ నుంచి గుడివాడ వెళుతున్న లారీ వెనుక నుంచి అతివేగంగా ఢీకొంది. డ్రైవర్ అబ్రహం మృతదేహం లారీ క్యాబిన్ శకలాలల్లో ఇరుక్కుపోవడం తో పెద్దాపురం పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చేందుకు ఎంతో శ్రమించాలిసివచ్చింది. మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
మరో ఘటనలో తుని జాతీయరహదారి పై తృటిలో పెను ప్రమాదం తప్పింది. భారీ లోడుతో వెళ్తున్న ఐచర్ వ్యాను అదుపుతప్పి డాల్ఫిన్ ఆర్టీసీ బస్సు పై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇరువురి డ్రైవర్లకు తీవ్ర గాయాలు అవ్వగా బస్సులో ఉన్న కొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏసీ బస్సు కావడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు చాలా ఆందోళనకు గురయ్యారు. ప్రయాణికులు భయాందోళన తో బస్సు అద్దాలు పగలగొట్టుకుని బయటకి వచ్చారు. ఈ బస్సు విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తుండగా తుని తాండవ బ్రిడ్జి మీద ఈ ఘటన చోటుచేసుకుంది.