విజయనగరం జూన్ 4,
పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణం జరిగింది.. చిట్టీల పేరుతో మోసానికి పాల్పడిన ఓ మహిళను స్థానికులు స్తంభానికి కట్టేయడం కలకలం రేపింది. కొమరాడ మండలం శివిని గ్రామంలో శోభ అనే మహిళ చీటీల పేరుతో గ్రామంలోని రైతుల నుండి కోటీ యాభై లక్షలు వసూలు చేసింది. తిరిగి వారికి చెల్లింపు చేయకుండా ఇబ్బందులకు గురిచేసింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు, మహిళలు.. శోభను స్ధంభానికి కట్టేశారు. ఇప్పటికే చిట్టీల వ్యాపారి శోభపై కేసు నమోదు అయింది. అయితే గ్రామానికి చేరుకున్న పోలీసులు… స్థంభానికి కట్టేసిన మహిళ కట్లు విప్పేశారు. డబ్బులు చెల్లించనందుకు స్ధంభానికి కట్టిన బాధితులపై కేసులు నమోదు చేస్తానని ఎస్‌ఐ హెచ్చరించారు. దీంతో ఎస్‌ఐ వైఖరి పట్ల గ్రామస్తులు నిరసనకు దిగారు.పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం శివిని గ్రామానికి చెందిన శోభ కొంతకాలంగా చిట్టీలు నిర్వహించేది. ఈ క్రమంలోనే గ్రామంలోని చాలామంది శోభ వద్ద చిట్టీలు వేశారు. చిట్టి డబ్బులు జమ అవుతున్నాయి గానీ, గ్రామస్తులెవరికీ తిరిగి ఇవ్వటంలేదు శోభ. చివరికి వడ్డీ కూడా చెల్లించలేదనే కోపంతో గ్రామస్తులు అంతా ఒక్కసారిగా శోభ ఇంటి పై దాడికి దిగారు.. శోభను రామమందిరం వద్దకు తీసుకువచ్చి మందిరం వద్ద ఉన్న స్థంభానికి కట్టేశారు. గ్రామస్తులంతా కలిసి ఆమెను ఇష్టం వచ్చినట్టుగా దూషించారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. శోభను అదుపులోకి తీసుకుని గ్రామస్తుల నుండి కాపాడారు.. అయితే ఇప్పటికే శోభ పై అప్పులు ఎగొట్టిన కేసు కొనసాగుతున్నట్లు పోలీసులు చెప్తున్నారు.. కేసు కోర్టులో ఉండగా గ్రామస్తులు శోభ పై దాడిచేయటాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.. అయితే గ్రామస్థుల నుండి ఎలాంటి ఇబ్బంది జరగకుండా శోభను పోలీసుల అదుపులోనే ఉంచారు. డబ్బులు చెల్లించనందుకు స్ధంభానికి కట్టిన భాదితులపై కేసులు నమోదు చేస్తానని ఎస్‌ఐ హెచ్చరించారు. దీంతో ఎస్‌ఐ వైఖరి పట్ల గ్రామస్తులు నిరసనకు దిగారు.