గుంటూరు జూన్ 4,
నిన్న ఘర్ణణలో హత్యకు గురైన టీడీపీ బీసీ నాయకుడు జల్లయ్య కుటుంబ సభ్యులను ఫోన్‌లో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ చేస్తోంది సామాజిక అన్యాయమని, ఒక పక్క సామాజిక న్యాయ భేరి అంటూ బస్సు యాత్రలు చేస్తూ మరోపక్క బీసీ నాయకుల్ని పక్కా ప్రణాళికతో హత్యలు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా బీసీలు తనవైపు లేరనే కక్షతోనే తన సామాజిక వర్గం నేతల్ని బీసీ నాయకుల్ని మట్టుపెట్టాలని జగన్ ఆదేశాలు జారీ చేసారన్నారు. సీఎం జగన్ బినామీ పిన్నెల్లి నియోజకవర్గం మాచర్లలోనే ఐదుగురు బీసీలను హత్యచేశారని, రాష్ట్రవ్యాప్తంగా వరుసగా బీసీ నేతల హత్యల వెనుక పెద్ద కుట్ర ఉందని లోకేష్ అగ్రహం వ్యక్తం చేశారు.
బీసీ నేత జల్లయ్య కుటుంబానికి టీడీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. రాజారెడ్డి రాజ్యాంగంలో హత్యలు చేసి హ్యాపీగా తిరగొచ్చు అనే భావనలో ఉన్నారని, రాబోయేది టీడీపీ ప్రభుత్వం.. ఖచ్చితంగా చేసిన ప్రతి నేరానికి వైసీపీ నాయకులు శిక్ష అనుభవించక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. నివాళులర్పించడానికి కూడా వీల్లేదని అరెస్టులు చేయడం ఏపీలో పోలీసు శాఖ దుస్థితిని తెలియజేస్తోందని, జల్లయ్యని హత్య చేసిన వారికి శిక్ష పడేవరకు న్యాయపరంగా పోరాడతామన్నారు.